
వసూల్ రాజాపై ఆర్డీఓ విచారణ
● టెలికాన్ఫరెన్స్‌లో కలెక్టర్ ఆగ్రహం
మోత్కూరు: ‘మోత్కూరు తహసీల్దార్ కార్యాలయంలో వసూల్ రాజా’ శీర్షికన సోమవారం సాక్షి దిన పత్రికలో ప్రచురితమైన కథనంపై యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు స్పందించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ చేయాలని భువనగిరి ఆర్డీఓ కృష్ణారెడ్డిని కలెక్టర్ ఆదేశించారు. ఈ మేరకు సోమవారం బాధితులు బాసోజు అంజయ్యచారి, గంట శ్రీనివాస్‌రెడ్డి వాంగ్మూలాన్ని ఆర్డీఓ స్వీకరించారు. నివేదికను కలెక్టర్‌కు అందజేయనున్నట్లు ఆర్డీఓ విలేకరులకు తెలిపారు. ఆయన వెంట తహసీల్దార్ జ్యోతి, డిప్యూటీ తహసీల్దార్ ఉపేందర్, ఆర్‌ఐ సుమన్ ఉన్నారు. అంతేకాకుండా తహసీల్దార్ కార్యాలయంలో జరుగుతున్న అక్రమ వసూళ్ల దందాపై కలెక్టర్ టెలికాన్ఫరెన్స్‌లో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతమైతే తహసీల్దార్లను బాధ్యులను చేస్తామని హెచ్చరించారు.
బిహార్ యువకుడి వద్ద
గంజాయి పట్టివేత
భూదాన్‌పోచంపల్లి: భూదాన్‌పోచంపల్లి పట్టణ కేంద్రంలో సోమవారం తెల్లవారుజామున బిహార్ రాష్ట్రానికి చెందిన యువకుడి వద్ద పోలీసులు గంజాయి పట్టుకున్నారు. పోచంపల్లి పట్టణ కేంద్ర పరిధిలోని అయ్యప్ప గుడి సమీపంలో పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా.. అనుమానాస్పదంగా తిరుగుతున్న యువకుడిని పట్టుకొని విచారించారు. అతడి వద్ద నుంచి 120 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వ్యక్తి బిహార్ రాష్ట్రం సహస్ర జిల్లా పరారియా మండలం బారాహీ తొలసుకసాని గ్రామానికి చెందిన తంటి మిథున్‌కుమార్‌గా పోలీసులు గుర్తించారు. మిథున్‌కుమార్‌తో పాటు పలువురు బిహార్ రాష్ట్రానికి చెందిన యువకులు పని నిమిత్తం 6 నెలల క్రితం పోచంపల్లికి వచ్చి స్థానికంగా సెంట్రింగ్ పనిచేస్తున్నారని ఎస్‌ఐ భాస్కర్‌రెడ్డి తెలిపారు. తన తోటి కూలీలకు విక్రయించేందుకు గంజాయి తీసుకొచ్చినట్లు మిథున్‌కుమార్ నిజం ఒప్పకున్నట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు. ఈ మేరకు అతడిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
కెనడాలోని టొరంటోలో
యాదగిరీశుడి కల్యాణం
యాదగిరిగుట్ట: కెనడా దేశంలోని టొరంటో నగరంలో ఆదివారం రాత్రి యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి కల్యాణ వేడుకను ఆలయ రిటైర్డ్ ప్రధానార్చకులు నల్లంథీఘల్ లక్ష్మీనరసింహచార్యులు, ఆలయాధికారి గజివెల్లి రఘు ఆధ్వర్యంలో నిర్వహించారు. శ్రీస్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను కల్యాణ మూర్తులుగా అలంకరించి కల్యాణ వేడుకను జరిపించారు. ఈ వేడుకల్లో తెలంగాణ కెనడా అసోసియేషన్ ప్రతినిధులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

వసూల్ రాజాపై ఆర్డీఓ విచారణ