
బంగారు నాణేలు ఇస్తామంటూ టోకరా
చివ్వెంల(సూర్యాపేట): పురాతన బంగారు నాణేలను తక్కువ ధరకు విక్రయిస్తామని ఓ వ్యాపారికి టోకరా పెట్టిన ముఠా సభ్యులపై పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసు వివరాలను సోమవారం సూర్యాపేట డీఎస్పీ ప్రసన్నకుమార్ విలేకరులకు వెల్లడించారు. చివ్వెంల మండలం దురాజ్‌పల్లి గ్రామ శివారులోని తెల్లబండ కాలనీకి చెందిన పసుపులేటి గణేష్, ఓర్సు చంటి, ముద్దంగుల వెంకన్న, పసుపుల సత్యం, పసుపుల నవీన్, ఓర్సు శ్రీను, ఓర్సు గోపమ్మ, పసుపుల లక్ష్మి, ముద్దంగుల అంజలి ముఠాగా ఏర్పడి సూర్యాపేటకు చెందిన వ్యాపారి నిమ్మనగోటి వెంకటేశ్వర్లుకు పురాతన బంగారు నాణేలు తక్కువ ధరకు విక్రయిస్తామని నమ్మబలికారు. దీంతో వెంకటేశ్వర్లు ఈ నెల 10న రూ.5లక్షలు, 11న రూ.15లక్షలు వారికి చెల్లించాడు. అనంతరం బంగారు నాణేల గురించి అడగగా.. రేపు మాపు అంటూ కాలం వెళ్లదీస్తుండడంతో అనుమానం వచ్చిన వెంకటేశ్వర్లు తన డబ్బులు తనకు తిరిగి ఇవ్వాలని కోరాడు. కాగా అప్పటికే వెంకటేశ్వర్లు నుంచి వసూలు చేసిన డబ్బుల్లో నుంచి పసుపుల గణేష్ రూ.12.50 లక్షలు, ఓర్సు చంటి రూ.6లక్షలు, ముద్దుంగుల వెంకన్న రూ.లక్ష, పసుపుల సత్యం రూ.50వేలు పంచుకున్నారు. నగదు తిరిగి ఇవ్వకపోగా.. గుర్తుతెలియని వ్యక్తులు తమను కొట్టి నగదు దోచుకెళ్లారంటూ ఓ వీడియో తీసి వెంకటేశ్వర్లు సెల్‌ఫోన్‌కు పంపించారు. దీంతో వెంకటేశ్వర్లు ఈ నెల 21న చివ్వెంల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. ఎస్‌ఐ వి. మహేశ్వర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మోసానికి పాల్పడిన పసుపుల గణేష్ నుంచి రూ.9.80 లక్షలు, చంటి నుంచి రూ.3.20 లక్షలు వెంకన్న నుంచి రూ.25 వేలు, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకుని నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్ తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. వీరిలో అంజలి పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ విలేకరుల సమావేశంలో సీఐ రాజశేఖర్, ఎస్‌ఐ మహేశ్వర్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
వ్యాపారి వద్ద రూ.20లక్షలు
స్వాహా చేసిన ముఠా
9 మందిపై కేసు నమోదు