
నేడు నల్లగొండకు మంత్రుల రాక
నల్లగొండ : నల్లగొండకు సోమవారం రాష్ట్ర రోడ్లు భవనాలు,సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమం, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి దామోదర రాజ నర్సింహ రానున్నారు. సోమవారం ఉదయం 10 గంటలకు హైదరాబాద్ నుంచి హెలికాప్టర్‌లో బయల్దేరి ఉదయం 10.30 గంటలకు నల్లగొండలోని ఎన్జీ కాలేజి మైదానానికి చేరుకుంటారు. జిల్లా కేంద్ర ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూ.1.50 కోట్లతో ఏర్పాటు చేసిన లాప్రోస్కోపిక్ సర్జరీ యూనిట్‌ను ప్రారంభిస్తారు. మెడికల్ కాలేజీలో వైద్య విద్యార్థులతో జరిగే కార్యక్రమంలో పాల్గొని హైదరాబాద్‌కు తిరిగి వెళ్తారు.
రాష్ట్రస్థాయి పోటీల్లో
విజేతలుగా నిలవాలి
నల్లగొండ టూటౌన్: రాష్ట్ర స్థాయిలో త్వరలో జరగనున్న యోగాసన పోటీల్లో జిల్లాకు చెందిన విద్యార్థులు విజేతలుగా నిలిచి నల్లగొండకు పేరు తేవాలని నల్లగొండ జిల్లా యోగా అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కుంభం నర్సిరెడ్డి అన్నారు. జిల్లా యోగా అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం నల్లగొండలోని ఎంవీఎన్ విజ్ఞాన కేంద్రంలో ఎంపిక పోటీలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. యోగాసనాలు వేయడం ద్వారా ఆరోగ్యంగా ఉండడంతోపాటు చురుకుదనంతో ముందుకు సాగవచ్చన్నారు. నిత్య జీవితంలో యోగా ఒక భాగం చేసుకోవాలన్నారు. ఈ పోటీలకు 90 మంది హాజరు కాగా ప్రతిభ కనబర్చిన వారిని రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేశారు. కార్యక్రమంలో యోగా అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి నంద్యాల రాజశేఖర్‌రెడ్డి, ఎస్‌జీఎఫ్ జిల్లా కార్యదర్శి విమల, టీజీపీఈటీఏ జిల్లా అధ్యక్షుడు సురేందర్‌రెడ్డి, జిల్లా కోశాధికారి షహీద్, యోగా కోచ్ నాగార్జున, ఎంవీఎన్ సెక్రటరీ నర్సిరెడ్డి, కరుణాకర్‌రెడ్డి పాల్గొన్నారు.
1న సీపీఎస్ ఉద్యోగుల ఆత్మగౌరవ సభ
నల్లగొండ టూటౌన్: హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సెప్టెంబరు 1న నిర్వహించనున్న సీపీఎస్ ఉద్యోగుల ఆత్మగౌరవ సభను విజయవంతం చేయాలని తెలంగాణ సీపీఎస్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగవెల్లి ఉపేందర్ కోరారు. ఆదివారం నల్లగొండలోని సంఘం కార్యాలయంలో నిర్వహించిన ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశంలో సీపీఎస్ ఉద్యోగుల సంఘం నాయకులు సిరందాసు రామదాస్, కుమార్‌రెడ్డి, తిరుపతి, కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
నారసింహుడికి
నిత్యారాధనలు
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆదివారం నిత్యారాధనలో భాగంగా సుదర్శన నారసింహహోమాన్ని అర్చకులు పాంచరాత్ర ఆగమశాస్త్రానుసారంగా ఘనంగా నిర్వహించారు. వేకువజామున ఆలయాన్ని తెరిచిన అర్చకులు స్వామివారి మేల్కొలుపులో భాగంగా సుప్రభాత సేవ చేపట్టారు. అనంతరం గర్భాలయంలో స్వయంభూ, ప్రతి ష్ఠా అలంకారమూర్తులకు నిజాభిషేకం, సహస్రనామార్చన చేశారు. ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజ వాహనసేవ, నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం, అష్టోత్తర పూజలు నిర్వహించారు. సాయంత్రం ఆలయంలో వెండిజోడు సేవను భక్తుల మధ్య ఊరేగించారు. రాత్రి శ్రీస్వామి, అమ్మవార్లకు శయనోత్సవం నిర్వహించి ఆలయాన్ని ద్వారబంధనం చేశారు.