
అసంపూర్తి.. అలంకార ప్రాయం!
కాల్వకు నీటిని విడుదల చేయాలి
గుర్రంపోడు : ఏఎమ్మార్పీ ప్రధాన కాల్వ ఎగువ గ్రామాలకు నీరందించే హైలెవెల్ కెనాల్‌గా పిలవబడుతున్న 7బీ డిస్ట్రిబ్యూటరీ ద్వారా సాగునీరు అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. సాగర్ ప్రాజెక్టులో గేట్లు బార్లా తెరిచి కిందకు నీరు వృథాగా వదులుతున్నా.. ఇక్కడి కాల్వకు మాత్రం చుక్క నీరు రావడం లేదు. ఈ కాల్వ అంగడిపేట, గుర్రంపోడు డివిజన్ల పరిధిలో సగంసగం ఉండటంతో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని రైతులు అంటున్నారు.
2009లో కాల్వ పనులు మొదలు..
అక్కంపల్లి బాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి తేనపల్లి చెరువు వరకు 18 కిలోమీటర్ల కాల్వ తవ్వకానికి 2008లో రూ.19 కోట్ల అంచనాతో నిధులు మంజూరు అయ్యాయి. 2009 జనవరి నెలలో పనులు ప్రారంభమై మందకోడిగా సాగి తానేదార్‌పల్లి గ్రామ చెరువు వరకు పనులు పూర్తి చేసి 2018లో కాల్వకు అట్టహాసంగా నీటిని విడుదల చేశారు. మళ్లీ ఆ తర్వాత నీరు కాల్వలో పారిందే లేదని రైతులు అంటున్నారు. ఈ కాల్వ పీఏపల్లి మండల పరిధిలో ఐదు వేల ఎకరాలకు, గుర్రంపోడు మండల పరిధిలో పది వేల ఎకరాలకు నీరు అందించాల్సి ఉంది. గత ఏడాది కాల్వ పైభాగంలోని మక్కపల్లి చెరువు తెగి ఈ కాల్వలో నీరు చేరడం, డీప్‌కట్ వల్ల కాల్వలో నీరు ఊరిందే తప్ప ఇప్పటి వరకు కృష్ణాజలాలు అందనేలేదు.
ఊసే లేని మరో ఐదుకిలోమీటర్ల తవ్వకం
ఏఎమ్మార్పీలో మరే ఇతర డిస్ట్రిబ్యూటరీల్లోనూ లేనివిధంగా ఈ క్వాల 9 నుంచి 12 మీటర్ల లోతు తవ్వాల్సి వచ్చింది. గుర్రంపోడు మండల పరిధిలో మైలాపురం నుంచి తానేదార్‌పల్లి వరకు కాల్వ తవ్వకం పూర్తికాగా.. తానేదార్‌పల్లి నుంచి తేనపల్లి చెరువు వరకు కాల్వ పనుల ఊసే లేదు. తానేదార్‌పల్లి చెరువు ఎత్తు రెండు మీటర్లు పెంచి రిజర్వాయర్‌గా మార్చి గ్రావిటీ లెవెల్‌ను బట్టి తర్వాత కాల్వకు డిజైన్ ఇస్తామన్న అధికారులు పనులు అర్థాతరంగా నిలిపివేశారు. అప్పట్లో మంజూరైన నిధుల్లో రూ.ఐదు కోట్ల నిధులు మిగులు ఉన్నా పనులు ముందుకు సాగలేదు. ఈ పనులు పూర్తయితే గుర్రంపోడు, తేనపల్లి గ్రామాల పరిధిలో మూడు వేల ఎకరాల ఆయకట్టుకు సాగు నీరు అందనుంది. కాగా ఈ విషయమై నీటిపారుదల శాఖ డీఈఈ పరమేష్‌ను ప్రశ్నించగా ప్రస్తుతం పీఏ పల్లి మండల పరిధిలో కాల్వలో అడ్డంగా రాళ్లు ఉండటం వల్ల నీరు చేరడం లేదని.. అక్కడి అధికారులతో మాట్లాడి ఈ ప్రాంతానికి నీరు అందేలా చూస్తామని తెలిపారు.
ఫ చుక్క నీరందని ఏఎమ్మార్పీ
7బీ డిస్ట్రిబ్యూటరీ
ఫ నిధులున్నా పూర్తికాని కాల్వ పనులు
ఫ సాగు నీరు అందక ఇబ్బంది
పడుతున్న రైతులు
ఏఎమ్మార్పీ కాల్వలకు గత నెల 28 నుంచి నీటిని విడుదల చేసినా ఈ కాల్వకు చుక్క నీరు రాలేదు. సాగునీరు సంగతి దేవుడెరుగు చెరువు నిండినా భూగర్భజలాలు పెరిగి బోర్లు నీరు అందిస్తాయి. నేరుగా చెరువులోకి గల ఈ కాల్వ ద్వారా నీటిని విడుదల చేసి చెరువు నింపాలి. కనీసం చెరువులు కూడా నిండకపోతే ఈ కాల్వను రూ.కోట్లు పెట్టి తవ్వి ప్రయోజనమేమిటో తెలియడం లేదు.
– శ్రీపతి వేణుగోపాల్‌రెడ్డి, రైతు తానేదార్‌పల్లి