
‘శిథిలం’పై అప్రమత్తం
ముందస్తుగా చర్యలు చేపట్టాం
దేవరకొండ : దేవరకొండ మున్సిపాలిటీ పరిధిలో పలుచోట్ల పురాతన ఇళ్లు, కట్టడాలు శిథిలావస్థలోకి చేరుకున్నాయి. కొన్ని కాలనీల్లో పాత మిద్దెలు ప్రమాదకరంగా మారాయి. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని సంబంధిత మున్సిపల్, టౌన్ ప్లానింగ్ అధికారులు వీటిని గుర్తించి ప్రమాదాలు జరగకముందే చర్యలను చేపడుతున్నారు. అందులో భాగంగా ప్రస్తుతం మున్సిపాలిటీలో శిథిలావస్థలో ఉన్న గృహాలు చిన్నచిన్న మైనర్ రిపేర్లు ఉంటే బాగు చేయించుకోవాలని, లేకుంటే వాటిని తొలగించుకోవాలని ఇప్పటికే నోటీసుల ద్వారా ఇంటి యాజమానులకు సూచించారు. పలు గృహాలకు ఒకవైపు పెచ్చులు ఊడడం, మరోవైపు గోడలు దెబ్బతిని ఉండటంతో మున్సిపల్ అధికారులు ముందస్తుగా అప్రమత్తమయ్యారు. అయితే గత ఏడాది కూడా చాలా వరకు శిథిలావస్థలో ఉన్న గృహాలను గుర్తించిన మున్సిపల్ శాఖ అధికారులు ముందస్తు నోటీసులు జారీ చేశారు.
మున్సిపాలిటీలో ఇలా..
దేవరకొండ మున్సిపాలిటీలో మొత్తం 20 వార్డులున్నాయి. కాగా ఆయా వార్డుల్లో శిథిలావస్థకు చేరిన ఇళ్లను ఇప్పటికే గుర్తించే పనిలో పడ్డ టౌన్ ప్లానింగ్ అధికారులు ఇప్పటి వరకు దాదాపు 20కి పైగా శిథిలావస్థకు చేరిన ఇళ్లు, భవనాలను గుర్తించినట్లు తెలుస్తోంది. కాగా ఇందులో ఏడుగురికి నోటీసులు జారీ చేయగా.. రెండు ఇళ్లను డిస్మెంటల్ చేసినట్లు సంబంధిత టౌన్ ప్లానింగ్ అధికారులు పేర్కొంటున్నారు. మున్సిపాలిటీ పరిధిలో యేటా వర్షాకాలానికి ముందే శిథిల భవనాలపై టౌన్ ప్లానింగ్ స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని, అక్కడ నివసించే వారిని గుర్తించి వేరే చోటుకు తరలించాల్సి ఉంటుంది.
దేవరకొండ మున్సిపాలిటీలో ఇప్పటి వరకు దాదాపు 20కి పైగా శిథిలావస్థకు చేరిన నిర్మాణాలను గుర్తించాం. వారందరికీ నోటీసులు సైతం జారీ చేస్తున్నాం. ఆ గృహ యాజమానులకు కలిసి ఏమైనా మరమ్మతులు ఉంటే చేయించుకోవాలని, లేకుంటే ఆ గృహాలను ఖాళీ చేయాలని నోటీసులు జారీ చేశాం. వర్షాకాలం నేపథ్యంలో ఎలాంటి ఘనటలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు చేపట్టాం.
– వర్షిత, టీపీబీఓ, దేవరకొండ
ఫ దేవరకొండ మున్సిపాలిటీలో
20కి పైగా శిథిల భవనాల గుర్తింపు
ఫ యజమానులకు నోటీసులు