
శిశుగృహకు నవజాత శిశువు అప్పగింత
పెద్దఅడిశర్లపల్లి: మూడో కాన్పులోనూ ఆడపిల్ల జన్మించడంతో సాకలేక బంధువులకు అప్పగించిన నవజాత శిశువును బుధవారం ఐసీడీఎస్ అధికారులు నల్లగొండ శిశుగృహ సిబ్బందికి అప్పగించారు. ఐసీడీఎస్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దఅడిశర్లపల్లి మండలం మునావత్‌తండాకు చెందిన మునావత్ శంకర్, రాణి దంపతులకు ఇద్దరు కుమార్తెలు సంతానం. మూడో కాన్పులోనూ రాణి ఆడబిడ్డకు జన్మించింది. దీంతో ముగ్గురిని సాకలేక నవజాత శిశువును బంధువులకు అప్పగించారు. రాణి కాన్పుకు అమ్మగారి ఇంటికి వెళ్లి రెండు నెలల తర్వాత ఈ నెల 4న మునావత్‌తండాకు శిశువు లేకుండా రావడంతో ఐసీడీఎస్ అధికారులకు అనుమానం వచ్చి ఆరా తీశారు. శంకర్, రాణి పొంతనలేని సమాధానాలు చెబుతుండటంతో మంగళవారం గుడిపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు శిశువు తల్లిదండ్రులు, బంధువులను స్టేషన్‌కు పిలిపించి విచారణ చేపట్టారు. ముగ్గురు ఆడపిల్లలను సాకలేక బంధువులకు అప్పగించారని తేలడంతో శిశుగృహకు అప్పగించారు.