
వ్యవసాయ పనుల్లో ఉత్తరాది కూలీలు
చౌటుప్పల్ రూరల్: గ్రామాల్లో రైతులు కూలీలు కొరతతో తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఇందుకు ప్రత్యామ్నాయంగా ఉత్తరాది రాష్ట్రాల నుంచి కూలీల ఆగమనం ప్రారంభమైంది. దీంతో వలస కూలీలు రైతులకు వ్యవసాయ పనుల్లో బాసటగా నిలుస్తున్నారు. ముఖ్యంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో వరి నాట్లతో పాటు పత్తి, ఇతర పంటల సాగులో పనిచేయడానికి ఉత్తరాది రాష్ట్రాల కూలీలు పెద్ద సంఖ్యలో గ్రామాలకు చేరుకున్నారు. ముఖ్యంగా మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బిహర్, పశ్చిమబెంగాల్, ఉత్తరాఖండ్‌తో పాటు ఛత్తీస్‌గడ్, జార్ఖండ్, ఒడిశా రాష్ట్రాల నుంచి కుటుంబాలతో కలసి కూలీలు యాదాద్రి భువనగిరి జిల్లాకు వలస వస్తున్నారు. వ్యవసాయ సీజన్ ముగిసే వరకు ఆయా గ్రామాల్లోని రైతుల వద్ద ఉంటున్నారు. చౌటుప్పల్, వలిగొండ, భూదాన్‌పోచంపల్లి మండలాల్లో రైతులు వలస కూలీలపై ఆధాపడి వ్యవసాయ పనులు చేస్తున్నారు. గతంలో మగ కూలీలు మాత్రమే వచ్చేవారు. ఈ ఏడాది మహిళలతో పాటు కుటుంబాలను తీసుకొని వచ్చారు. ప్రతి గ్రామంలో వరి నాట్లు సగం వరకు వలస కూలీలే పూర్తిచేస్తున్నారు.
వ్యవసాయ క్షేత్రాల్లోనే నివాసం,
వంటావార్పు..
వలస కూలీలకు రైతులు తమ వ్యవసాయ క్షేత్రాల వద్దనే నివాస ఏర్పాట్లు చేస్తున్నారు. అక్కడే వారు వంట చేసుకుంటున్నారు. వరి నాట్లకు వెళ్లే కూలీలు ఉదయమే పంట పొలాలకు వెళ్లి నాట్లు వేస్తున్నారు. పత్తి చేలలో కలుపు తీసే పనులకు వెళ్లే వారు వంట చేసుకొని మధ్యాహ్నం భోజనం తీసుకుని వెళ్తున్నారు. స్థానిక కూలీలు ఎకరాకు పది నుంచి పన్నెండు మంది నాట్లు వేస్తే వీరు మాత్రం నలుగురు లేదా ఐదుగురు మాత్రమే పూర్తి చేస్తున్నారు. దీంతో ఖర్చు తగ్గుతుండడంతో రైతులు వలస కూలీల వైపు మొగ్గు చూపుతున్నారు.
అన్ని పనుల్లో ఆరితేరి..
వలస కూలీలు పత్తి చేనులో కలుపు తీయడం నుంచి గుంటుక కొట్టడం, అడుగు మందు వేయడం, పురుగు మందులు కొట్టడం వంటి పనులు చేస్తున్నారు. చౌటుప్పల్ మండలం ఆరెగూడెం, పంతంగి, రెడ్డిబాయి గ్రామాల్లో రైతుల వద్దకు పది కుటుంబాలు వలస వచ్చారు. ఇలా సుమారు ఆయా గ్రామాల్లోనే రెండు వందల మందికి పైగా వలస కూలీలు ఉన్నారు. వీరు ట్రాక్టర్ పనులు కూడా చేస్తున్నారు.
కూలి తక్కువ.. పని త్వరగా..
వలస కూలీలకు ఇచ్చే కూలి స్థానిక కూలీలతో పోల్చితే తక్కువగా ఉంది. వరి నాట్ల కోసం ఎకరాకు రూ.5వేలు ఇస్తున్నారు. స్థానిక కూలీలకు ఎకరాకు రూ.6వేలు ఇస్తున్నారు. పత్తి చేనులో పనికి వెళ్తే వలస కూలీలకు రూ.400 ఇస్తే, స్థానిక కూలీలకు రూ.500 ఇస్తున్నారు. ఇలా కూలీ తక్కువ ఉంటుంది. వీరు పని కూడా త్వరగా పూర్తిచేసుకుని వెళ్తున్నారు.
గ్రామాల్లో కూలీల కొరత
తీరిందంటున్న స్థానిక రైతులు
వలస కూలీలకు షెల్టర్ ఏర్పాటు చేస్తున్న అన్నదాతలు