
బాలికను కిడ్నాప్ చేసిన వ్యక్తికి మూడేళ్లు జైలు శిక్ష
రామగిరి(నల్లగొండ): బాలికను కిడ్నాప్ చేసిన వ్యక్తికి మూడేళ్లు జైలు శిక్ష విధిస్తూ నల్ల గొండ పోక్సో కోర్టు జడ్జి ఎన్. రోజారమణి బుధవారం తీర్పు వెలువరించారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం.. నాంపల్లి మండలం చమలపల్లి గ్రామానికి చెందిన మంగళపల్లి యాలాద్రి అదే గ్రామానికి చెందిన బాలికకు మాయమాటలు చెప్పి 2014 మే 15న కిడ్నాప్ చేశాడు. బాలిక తల్లి నాంపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా.. అప్పటి సీఐ వెంకట్‌రెడ్డి కేసు నమోదు చేసి విచారణ జరిపి నిందితుడు యాలాద్రిని కోర్టులో హాజరుపరిచారు. స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వేముల రంజిత్‌కుమార్ వాదనలతో ఏకీభవించిన జడ్జి రోజారమణి నిందితుడికి మూడేళ్లు జైలు శిక్ష, రూ.5వేల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు. ప్రస్తుత సీఐ రాజు, కోర్టు కానిస్టేబుల్ సైదులు, లైజన్ ఆఫీసర్ నరేందర్ సరైన ఆధారాలు కోర్టుకు సమర్పించడంలో సహకరించారు.
కుంటలో గల్లంతైన
యువకుడి మృతదేహం లభ్యం
బొమ్మలరామారం: స్నేహితులతో కలిసి కుంటలో ఈతకు వెళ్లి గల్లంతైన యువకుడి మృతదేహం బుధవారం లభ్యమైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బొమ్మలరామారం మండలం మర్యాల గ్రామ శివారులో గల బ్లూ అగ్రిగేట్స్ స్టోన్ క్రషర్‌లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన నందిలాల్ భారతి(25) పని చేస్తున్నాడు. ఇటీవల కురిసిన వర్షాలకు స్టోన్ క్రషర్ సమీపంలోని కుమ్మరి కుంటలో నీరు చేరింది. నందిలాల్ భారతితో పాటు మరో నలుగురు కార్మికులు మంగళవారం ఉదయం కుమ్మరి కుంటలో ఈత కొడుతుండగా.. లోతు అంచనా వేయకలేక నందిలాల్ భారతి కుంటలో మునిగిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని స్థానిక జాలరుల సహాయంతో నందిలాల్ భారతి కోసం గాలించారు. ఎస్‌డీఆర్‌ఎఫ్ రెస్క్యూ టీం రంగంలో దిగి మంగళవారం రాత్రి వరకు గాలింపు చర్యలు చేపట్టినా ఆచూకీ లభించలేదు. బుధవారం ఉదయం తిరిగి గాలింపు చర్యలు చేపట్టగా.. సాయంత్రం నందిలాల్ భారతి మృతదేహాన్ని కుంటో నుంచి వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం భువనగిరి జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించినట్లు స్థానిక ఎస్‌ఐ బుగ్గ శ్రీశైలం తెలిపారు.
కానిస్టేబుల్‌ను ఢీకొట్టిన ద్విచక్ర వాహనదారుడు
● కానిస్టేబుల్‌తో పాటు
వాహనదారుడికి గాయాలు
● పంతంగి టోల్‌ప్లాజా వద్ద ఘటన
చౌటుప్పల్ రూరల్: మద్యం మత్తుతో స్కూటీపై వెళ్తున్న వ్యక్తి వాహనాలు తనిఖీ చేస్తున్న హెడ్‌కానిస్టేబుల్‌ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో కానిస్టేబుల్‌తో పాటు వాహనదారుడికి గాయాలయ్యాయి. ఈ ఘటన చౌటుప్పల్ మండలం పంతంగి టోల్‌ప్లాజా వద్ద మంగళవారం రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చౌటప్పల్ ట్రాఫిక్ పోలీస్ సేష్టన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న ఎస్‌కే ఆసిఫ్ మంగళవారం రాత్రి పంతంగి టోల్‌ప్లాజా వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా.. విజయవాడ వైపు నుంచి హైదరాబాద్‌కు స్కూటీపై వెళ్తున్న హైదరాబాద్‌లోని కొత్తపేటకు చెందిన విశాల్‌ను ఆపబోయాడు. కానీ మద్యం మత్తులో ఉన్న విశాల్ స్కూటీతో హెడ్‌కానిస్టేబుల్ ఆసిఫ్‌ను ఢీకొట్టి పారిపోయే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో విశాల్ స్కూటీ పైనుంచి కిందపడిపోయాడు. ఈ ప్రమాదంలో హెడ్ కానిస్టేబుల్ ఆసిఫ్ కాలు విరగడంతో చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. విశాల్‌కు స్వల్ప గాయాలు కావడంతో కొత్తపేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ట్రాఫిక్ కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చౌటుప్పల్ సీఐ మన్మథకుమార్ తెలిపారు.