
అత్యవసరమైతేనే బయటికి వెళ్లాలి
● ఎస్పీ శరత్‌చంద్ర పవార్
మిర్యాలగూడ, మిర్యాలగూడ టౌన్ : వాతావరణ శాఖ ఇచ్చిన సూచనల మేరకు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి ఎవరూ బయటికి వెళ్లవద్దని ఎస్పీ శరత్‌చంద్ర పవార్ సూచించారు. బుధవారం రాత్రి మాడుగులపల్లి వద్ద అద్దంకి–నార్కట్‌పల్లి ప్రధాన రహదారిపై ప్రవహిస్తున్న నీటి ప్రవాహాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఎడతేరపి లేకుండా వర్షాలు వస్తున్న నేపథ్యంలో మూసీ, కృష్ణా పరివాహక ప్రాంతాల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయన్నారు. జిల్లా వ్యాప్తంగా నీటి ప్రవాహం ఎక్కువగా ఉండే వాగులు, వంకలు, కాలువల వద్ద హెచ్చరిక బోర్డులు, పోలీస్ పికెట్ ఏర్పాటు చేశామన్నారు. పాడుబడిన మిద్దెలు, పడిపోయే స్థితిలో ఉన్న గృహాలు, చెట్ల కింద ఎవరూ ఉండవద్దని సూచించారు. వ్యవసాయ పనుల కోసం వెళ్లే రైతులు మోటార్ స్వీచ్‌లు ఆన్ ఆఫ్ చేయవద్దన్నారు. రోడ్ల వెంట ఉన్న విద్యుత్ స్తంభాలు పట్టుకుంటే విద్యుత్ షాక్ వచ్చే ప్రమాదం ఉందన్నారు. పోలీస్ యంత్రాంగం 24గంటల పాటు అందుబాటులో ఉంటుందని.. ఏమైన సమస్య వస్తే వెంటనే 100 నంబరుకు డయల్ చేయాలని సూచించారు. ఆయన వెంట మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్‌రాజు, ఎస్‌బి సీఐ రాము తదితరులున్నారు.