ప్రబలుతున్న విషజ్వరాలు | - | Sakshi
Sakshi News home page

ప్రబలుతున్న విషజ్వరాలు

Aug 8 2025 9:03 AM | Updated on Aug 8 2025 9:03 AM

ప్రబల

ప్రబలుతున్న విషజ్వరాలు

జ్వర పీడితులతో

ఆస్పత్రులు కిటకిట

మలేరియా, టైపాయిడ్‌ బాధితులే అధికం

ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోజూ వందల సంఖ్యలో ఓపీ

మార్చి నుంచి ఎనిమిది డెంగీ పాజిటివ్‌ కేసులు నమోదు

పరీక్షల పేరుతో దోచుకుంటున్న ప్రైవేటు ఆస్పత్రులు

వైద్యాధికారుల సూచనలు ఇవీ..

● దోమలు పెరగకుండా ఇళ్ల ముందు మురికి గుంతల్లో రసాయన ద్రవాలను పిచికారీ చేయించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి.

● పాత ట్యూబులు, కుండల్లో నీరు నిల్వ ఉంకుండా చూడాలి.

● దోమ తెరలను వినియోగించుకోవాలి.

● జ్వర లక్షణాలు కనిపిస్తే ఆసుపత్రులకు వెళ్లి చికిత్స పొందాలి.

● చిన్న పిల్లలను పట్ల అప్రమత్తంగా ఉండాలి. జ్వరం వస్తే వెంటనే వైద్యులను సంప్రదించి చికిత్స అందించాలి.

● ఇంటి పరిసరాలతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తే సీజనల్‌ వ్యాధుల నుంచి బయటపడవచ్చు.

నల్లగొండ టౌన్‌: వానాకాలం కావడంతో సీజనల్‌గా వచ్చే విషజ్వరాలు ప్రబలుతున్నాయి. కొన్ని రోజులుగా అడపాదడపా కురుస్తున్న వర్షాలకు జిల్లాలోని వివిధ ప్రాంతాల ప్రజలు డెంగీతోపాటు మలేరియా, టైపాయిడ్‌ వంటి లక్షణాలతో ఆస్పత్రుల పాలవుతున్నాయి. ఇందులో మలేరియా, టైపాయిడ్‌, సాధారణ జ్వరపీడితులతో ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ గణాంకాల ప్రకారం మార్చి నుంచి ఇప్పటి వరకు వెయ్యికి పైగా రక్త పరీక్షలు చేయగా ఎనిమిది డెంగీ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. నల్లగొండ, నార్కట్‌పల్లి, కేతేపల్లి, దామరచర్ల, నాగార్జునసాగర్‌ ప్రాంతాల్లోని ప్రజలు డెంగీ లక్షణాలతో బాధ పడుతున్నారు. ఈ నేపథ్యంలో నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రిలో జూన్‌ నుంచి ప్రతిరోజూ 400 నుంచి 600 వరకు ఓపీ నమోదవుతోంది. సాధారణ రోజుల్లోనైతే 300 వరకు ఓపీ నమోదయ్యేది. అయితే సెప్టెంబర్‌, అక్టోబర్‌ నెలల్లో కూడా వర్షాలు కురిస్తే డెంగీ కేసులు మరిన్ని పెరిగే అవకాశం ఉంటుందని వైద్యులు అంటున్నారు.

మురుగునీటి నిల్వే కారణం..

ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు నీటి గుంతలతో పాటు మురుగు కాల్వల్లో, ఇళ్లలో నీటి తొట్లు, పగిలిపోయిన కుండలు, పాత డ్రమ్ములు, కొబ్బరిబోండాల వంటి వాటిల్లో నీటి నిల్వలు ఉండడం వల్ల దోమల వ్యాప్తి పెరిగి డెంగీ ప్రబలుతోంది. గ్రామాలు, పట్టణాల్లోని వీధులను పరిశుభ్రంగా ఉంచడంతోపాటు వర్షాలకు ముందు తర్వాత డ్రెయినేజీల్లో పూడిక తీసివేసి మురుగునీరు సక్రమంగా పారేలా చూడాల్సిన బాధ్యత సంబంధిత శాఖలపై ఉన్నా పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దోమల వ్యాప్తిని అరికట్టేందుకు వారంలో ఒక రోజు డ్రైడేగా పాటించి పేరుకుపోయిన నీటి నిల్వలను పారబోయడం వల్ల డెంగీని అరికట్టవచ్చు. ముఖ్యంగా అర్బన్‌ మలేరియా విభాగంలో ఒక్క నల్లగొండ పట్టణంలో 60 మంది వరకు సిబ్బంది ఉన్నారు. వీరంతా దోమల నివారణకు మందు చల్లడం, ఫాగింగ్‌ చేయడంలో నిర్లక్ష్యం చేస్తున్నారని తెలుస్తోంది.

పెరుగుతున్న రోగులు

జిల్లాలో సీజనల్‌ వ్యాధులతో బాధపడుతూ ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. నల్లగొండ ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రి (జీజీహెచ్‌), మిర్యాలగూడ, నాగార్జునసాగర్‌, దేవరకొండ, నకిరేకల్‌, మర్రిగూడ వంటి ప్రభుత్వ ఆస్పత్రుల్లో కూడా డెంగీ, మలేరియా, టైపాయిడ్‌ వంటి లక్షణాలతో బాధితులు పెద్ద ఎత్తున చేరుతున్నారు. ఇదే పరిస్థితి ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ కనిపిస్తోంది. అయితే ప్రైవేటు ఆస్పత్రుల్లో డెంగీ పరీక్షల పేరుతో బాధితుల నుంచి భారీగా ఫీజులు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కేవలం డెంగీ పరీక్షలు ప్రభుత్వ ఆస్పత్రిలో ఎలిశా పరీక్ష ద్వారా చేయాల్సి ఉంటుంది. కానీ, ప్రైవేటు ఆస్పత్రుల నిర్వాహకులు డెంగీ బూచిని చూపి వివిధ పరీక్షల పేరుతో బాధితులను నిలువ దోపిడీ చేస్తున్నారు.

ప్రభుత్వ ఆస్పత్రుల వివరాలు

ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రి 01

ఏరియా ఆస్పత్రులు 04

అర్బన్‌ హెల్త్‌ సెంటర్లు 05

కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌ 01

పీహెచ్‌సీలు 34

బస్తీ దవాఖానాలు 195

పల్లె దవాఖానాలు 07

సిబ్బందిని అప్రమత్తం చేశాం

జిల్లాలో డెంగీ వ్యాప్తి చెందకుండా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందిని అప్రమత్తం చేశాం. అన్ని గ్రామాలు, పట్టణాల్లో మురుగునీటి గుంతల్లో దోమల నివారణకు మందులు స్ప్రే చేయాలని ఆదేశించాం. ప్రజలు కూడా ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. వ్యక్తిగత పారిశుభ్రత పాటించాలి. డెంగీ లక్షణాలు కనపడితే సమీప ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పరీక్షలు చేయించుకోవాలి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులను సంప్రదించి సరైన వైద్యసేవలు పొందాలి.

– పుట్ల శ్రీనివాస్‌, డీఎంహెచ్‌ఓ

ప్రబలుతున్న విషజ్వరాలు 1
1/2

ప్రబలుతున్న విషజ్వరాలు

ప్రబలుతున్న విషజ్వరాలు 2
2/2

ప్రబలుతున్న విషజ్వరాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement