21న ముస్లిం పర్సనల్ లా బోర్డు సభ
నల్లగొండ : వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా, భారత రాజ్యాంగ పరిరక్షణకు ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆధ్వర్యంలో నల్లగొండలో ఈ నెల 21న బహిరంగ సభ నిర్వహించనున్నట్లు సభ కన్వీనర్ మౌలానా బసీర్ ఖాస్మి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ బోర్డు అధ్యక్షుడు ఖలీద్ సైఫూల్లా రహమాని అధ్యక్షత వహిస్తారని పేర్కొన్నారు. ఈ సభకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తదితరులు హాజరవుతున్నట్లు తెలిపారు. ఈ సభకు ముస్లిం మైనార్టీలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.
మంత్రి తుమ్మలను కలిసిన డీసీసీబీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి
నల్లగొండ టౌన్ : రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును ఆదివారం హైదరాబాద్‌లో నల్లగొండ డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివాస్‌రెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు. రాష్ట్రంలోని సహకార సంఘాల అభివృద్ధికి ప్రభుత్వ పరంగా తగిన సహాయ సహకారాలు అందించాలని కోరారు. వ్యవసాయ అనుబంధ రంగాలకు 50 శాతం సబ్సిడీతో రుణాలు అందేలా ప్రణాళిక సిద్ధం చేసి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని విన్నవించారు. వీటికి సానుకూలంగా స్పందించిన మంత్రి తుమ్మల సహకార సంఘాల బలోపేతానికి తనవంతు సహకారం అందిస్తాని హామీ ఇచ్చారని తెలిపారు.
జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష ప్రశాంతం
నల్లగొండ : జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష ఆదివానం నల్లగొండలోని ఎస్‌పీఆర్ పాఠశాల కేంద్రంలో ప్రశాంతంగా జరిగింది. ఈ కేంద్రాలనికి మొత్తం 185 మంది విద్యార్థులను కేటాయించగా.. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు జరిగిన మొదటి పేపర్ పరీక్షకు 181 మంది హాజరయ్యారు. మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 గంటల వరకు జరిగిన రెండో పేపర్‌కు 180 మంది విద్యార్థులు హాజరయ్యారు.
నేత్రపర్వంగా తిరువీధి సేవ
భువనగిరి : పట్టణ పరిధిలోని స్వర్ణగిరి క్షేత్రంలో గల శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం రాత్రి స్వామివారికి తిరువీధి సేవ నేత్రపర్వంగా నిర్వహించారు. అంతకుముందు వేకువజామున సుభ్రబాత సేవ, తోమాల సేవ, సహస్రనామార్చన, నిత్యకల్యాణ వేడుక తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మధ్యాహ్నం భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. సాయంత్రం స్వామివారికి కర్పూర మంగళహారతులు సమర్పించారు.
ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వొద్దు
సూర్యాపేట : ఉద్యోగ నియామకాలకు సంబంధించిన నోటిఫికేషన్లు ఇవ్వొద్దని మాల మహానాడు తెలంగాణ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు, న్యాయవాది తల్లమల్ల హస్సేన్ ఆదివారం ఒక ప్రకటనలో రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఎస్పీ వర్గీకరణ తీర్పు, గైడ్‌లైన్స్‌ను సరిగ్గా పరిశీలించకుండా ఎస్సీ వర్గీకరణ చేయడం తగదని పేర్కొన్నారు. ఈ విషయంపై మాల మహానాడు, షెడ్యూల్డ్ కులాల హక్కుల ఫోరం తరఫున హైకోర్టులో పిటిషన్ వేశామని తెలిపారు. రెండు వాయిదాల తర్వాత కూడా రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయలేదని ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇవ్వొద్దని పేర్కొన్నారు.
21న ముస్లిం పర్సనల్ లా బోర్డు సభ


