సరస్వతీ పుష్కరాలకు ప్రత్యేక బస్సులు
రామగిరి(నల్లగొండ): కాళేశ్వరం ప్రాజెక్టు వద్ద జరుగుతున్న సరస్వతీ నది పుష్కరాలకు ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు టీజీ ఆర్టీసీ రీజనల్ మేనేజర్ కె.జానిరెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి జిల్లాలోని అన్ని డిపోల నుంచి ఈనెల 26 వరకు డీలక్స్, సూపర్ లక్జరీ బస్సులు నడపనున్నట్లు పేర్కొన్నారు. పుష్కరాలకు వెళ్లే ప్రత్యేక బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం వర్తించదని తెలిపారు.
కార్పొరేట్ కళాశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తులు
నల్లగొండ : కార్పొరేట్ కళాశాలల్లో ఇంటర్ ఫస్టియర్‌లో ప్రవేశాల కోసం ఈ నెల 17 నుంచి 30వ తేదీ వరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఎస్సీ సంక్షేమ శాఖ డీడీ రాజ్‌కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పదో తరగతిలో 400 మార్కులకుపైగా సాధించిన జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులు అర్హులని పేర్కొన్నారు. సంక్షేమ గురుకులాలు, కేజీబీవీలు, జెడ్పీహెచ్‌ఎస్‌లు, ఇతర ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు మాత్రమే దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉందని తెలిపారు.
సొంత జిల్లాలకు
తహసీల్దార్లు
నల్లగొండ: ఎన్నికల విధుల్లో భాగంగా గతంలో బదిలీ అయిన తహసీల్దార్లను ప్రభుత్వం తిరిగి సొంత జిల్లాలకు పంపింది. ఈ మేరకు ల్యాండ్ అడ్మినిస్ట్రేటివ్ చీఫ్ కమిషనర్ నవీన్ మిట్టల్ ఉత్తర్వులు జారీ చేశారు. 2023 డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రభుత్వం మల్టీజోన్–2 పరిధిలోని జిల్లాలకు చెందిన తహసీల్దార్లను ఇతర జిల్లాలకు బదిలీ చేసింది. వారిలో ఇప్పుడు 44 మందిని బదిలీ చేశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి 11 మంది తహసీల్దార్లు వారి జిల్లాలకు పంపగా, మరో ఏడుగురు బదిలీపై జిల్లాకు వచ్చారు.
మొక్కల సంరక్షణపై శ్రద్ధచూపాలి
కట్టంగూర్, శాలిగౌరారం : గ్రామ పంచాయతీ సిబ్బంది మొక్కల సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధచూపాలని డీఆర్‌డీఓ వై.శేఖర్‌రెడ్డి అన్నారు. గురువారం కట్టంగూర్ మండలం కురుమర్తి, నారెగూడెం, ఎరసానిగూడెం గ్రామాల్లో నర్సరీలతోపాటు శాలిగౌరారం మండలం పెర్కకొండారంలో నర్సరీ, రైతులు సాగుచేస్తున్న మునగ తోటను ఆయన పరిశీలించి మాట్లాడారు. ఉపాధి కూలీలకు రోజువారీగా రూ.307 తగ్గకుండా కూలి గిట్టుబాటు అయ్యేలా చూడాలని ఏపీఓ, ఉపాధి సిబ్బందికి సూచించారు. నారెగూడెం, ఎరసానిగూడెం గ్రామాల్లో గల నర్సరీల్లో మొక్కల పెంపకం సక్రమంగా లేకపోవటంతో జీపీ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నర్సరీలను పరిశీలించి నివేదిక సమర్పించాలని ఎంపీఓను ఆదేశించారు. నిమ్మ, కొబ్బరి, మామిడి, మునగ, డ్రాగన్ ప్రూట్ తోటల సాగులో ప్రభుత్వ రాయితీని పొందడంతోపాటు అధిక ఆదాయాన్ని ఆర్జించవచ్చన్నారు. ఆయన వెంట నకిరేకల్ క్లస్టర్ ఏపీడీ బీఎల్ నర్సింహారావు, ఎంపీఓలు చలపతి, సుధాకర్, ఏపీఓలు కడెం రాంమోహన్, జంగమ్మ, ఏపీఎం సైదులు, కార్యదర్శులు జయసుధ, పెద్దయ్య, ఈసీ శ్రీధర్ తదితరులు ఉన్నారు.
స్వర్ణగిరీశుడికి తిరుపావడ సేవ
భువనగిరి : పట్టణ పరిధిలోని స్వర్ణగిరి క్షేత్రంలో గల శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో గురువారం తిరుపావడ సేవ వైభవంగా నిర్వహించారు. 450 కిలోల అన్నప్రసాదం, లడ్డూ, వడ తదితర పిండి వంటలను స్వామివారికి నైవేద్యంగా సమర్పించారు. అంతకుముందు ఉదయం ఆలయంలో సుప్రభాతసేవ, తోమాల సేవ, సహస్రనామార్చన, స్వామి, అమ్మవారికి నిత్యకల్యాణం నిర్వహించారు.


