633.50 అడుగులకు మూసీ నీటిమట్టం
కేతేపల్లి : మూసీ ప్రాజెక్టులో నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. మూసీ ఎగువ ప్రాంతాల్లో అక్కడక్కడా కురుస్తున్న వర్షాలతో శనివారం ప్రాజెక్టులోకి 450 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 645 అడుగులు (4.46 టీఎంసీలు) కాగా ఎగువ నుంచి వస్తున్న ఇన్‌ఫ్లోతో శనివారం సాయంత్రం నాటికి నీటిమట్టం 633.50 అడుగులకు (1.96 టీఎంసీలు) చేరుకుంది. ఏప్రిల్‌లో మూసీ కాల్వలకు నీటి విడుదల నిలిపి వేసే నాటికి ప్రాజెక్టులో నీటిమట్టం 622 అడుగులుగా ఉంది. నాటి నుంచి అకాల వర్షాల ప్రభావం, హైదరాబాద్ నుంచి వచ్చే నీటితో ప్రాజెక్టు నీటిమట్టం పెరుగుతూ నీటిమట్టం 633.5 అడుగులకు చేరుకుంది. నెలరోజుల్లో దాదాపు 12 అడుగుల మేర నీటి మట్టం పెరిగింది.


