ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి
ఇతర రాష్ట్రాల ధాన్యం తీసుకువచ్చి జిల్లాలో విక్రయించకుండా అంతర్రాష్ట్ర చెక్‌పోస్టులను ఏర్పాటు చేస్తామని కలెక్టర్ ఇలా త్రిపాఠి పేర్కొన్నారు. అలాగే ఇంటర్నల్ చెక్‌పోస్టులను కూడా ఏర్పాటు చేస్తామన్నారు. ధాన్యం కొనుగోళ్లపై అధికారులు, మిల్లర్లతో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. మద్దతు ధర, ధాన్యం సేకరణపై రూపొందించిన వాల్‌పోస్టర్, కరపత్రాలను కలెక్టర్ ఆవిష్కరించారు. ధాన్యం సేకరణ విషయంలో ఎలాంటి తప్పులకు ఆస్కారం ఇవ్వొద్దని సూచించారు. గత వానాకాలం సీజన్‌లో గుర్తించిన లోపాలను ఇప్పుడు సరిచేసుకోవాలన్నారు. ఏదేని ధాన్యం కొనుగోలు కేంద్రంలో అవకతవకలు జరిగినట్లు లేదా నిర్లక్ష్యం వహించినట్లు తెలిస్తే ఆ సెంటర్‌ను రద్దు చేస్తామన్నారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని అన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ఓఆర్‌ఎస్ పాకెట్లతోపాటు, మందులు ఏర్పాటు చేయాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే ఓపీఎంఎస్ ఎంట్రీ చేయాలని, ధాన్యం కొనుగోలు చేసే సమయంలోనే రైతుల నుంచి పాస్‌బుక్, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ కు సంబంధించిన వివరాలు తీసుకోవాలన్నారు. తేమ 17 శాతానికి మించకుండా ఉండేలా రైతులకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు.


