నాగార్జునసాగర్: గత కొన్నాళ్లుగా ఎయిర్‌టెల్, బీఎస్‌ఎన్‌ఎల్ సిగ్నల్ టవర్లలోని ఆఆర్‌యూ(రేడియో రిమోట్ యూనిట్), బీబీయూ(బేస్ బాండ్ యూనిట్)ల దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర దొంగల ముఠాను నాగార్జునసాగర్ సర్కిల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం విజయపురి సౌత్‌జోన్ పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో సీఐ బీసన్న వివరాలు వెల్లడించారు. తిరుమలగిరి(సాగర్) మండలం జానారెడ్డి కాలనీకి చెందిన జటావత్ మహేష్, జటావత్ నాగేష్, జటావత్ వినోద్‌లు కొంత కాలం నుంచి పెద్దవూర, తిరుమలగిరి(సాగర్),హాలియా మండలాలతో పాటు, ఆంధ్రప్రదేశ్‌లోని నరసరావుపేట పరిధిలో గల పలు ఎయిర్‌టెల్, బీఎస్‌ఎన్‌ఎల్ టవర్లలో 5జీ ఇంటర్‌న్నెట్ సిగ్నల్ కోసం బిగించే ఆఆర్‌యూ (రేడియో రిమోట్ యూనిట్), బీబీయూ (బేస్ బాండ్ యూనిట్)లను దొంగిలించి వాటిని హైదరాబాద్‌లోని నాంపల్లికి చెందిన మాలిక్ అనే వ్యక్తికి విక్రయించేవారు. ఈ దొంగల ముఠాకు గతంలో సెల్‌పోన్ టవర్లలో పనిచేసిన అనుభవం ఉండటంతో సులభంగా డబ్బులు సంపాదించవచ్చనే ఉద్దేశ్యంతో ఈ దొంగతనాలకు పాల్పడుతుండేవారు. మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్‌రాజు పర్యవేక్షణలో, సీఐ బీసన్న ఆధ్వర్యంలో పెద్దవూర ఎస్‌ఐ వీరబాబు తన సిబ్బందితో కలిసి పెద్దవూర మండలంలోని పోతునూరు గ్రామ శివారులోని టోల్‌గేట్ వద్ద నిందితులను పట్టుకొని అరెస్ట్ చేశారు. నిందితులను విచారించగా మొత్తం ఐదు కేసుల్లో నేరం అంగీకరించినట్లు సీఐ తెలిపారు. దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురితో పాటు, యూనిట్లను కొనుగోలు చేసి వారికి సహకరించిన మాలిక్‌పై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు చెప్పారు. నిందితుల నుంచి ఒక ఆర్‌ఆర్‌యూ యూనిట్, రూ. లక్షా యాభై వేల నగదు, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. కేసును త్వరితగతిన చేఽధించిన ఎస్‌ఐ వీరబాబు, సిబ్బందిని సీఐ బీసన్న అభినందించారు.


