
22 నాటికి రుణమాఫీ సొమ్ము జమచేయాలి
రైతులెవరూ ఓటీపీ నంబర్ చెప్పొద్దు
రుణమాఫీకి సంబంధించి ఎవరు ఫోన్ చేసినా రైతులు మాత్రం ఓటీపీ నంబర్లు చెప్పవద్దని కలెక్టర్ సి.నారాయణరెడ్డి సూచించారు. సైబర్ నేరగాళ్లు వివిధ రకాల మోసాలకు పాల్పడుతున్నారని, ఈ విషయాన్ని రైతులు గుర్తుంచుకోవాలన్నారు. మీ పంట రుణమాఫీకి సంబంధించి బ్యాంకు ఖాతా నంబర్, ఓటీపీ, ఆధార్ కార్డు నంబర్ చెప్పాలని బ్యాంకు నుంచి మాట్లాడుతున్నామని చెప్పి మోసం చేస్తారని, వారి మాటలను నమ్మి వివరాలు చెప్పవద్దన్నారు. రైతులు బ్యాంకులను సంప్రదించి వారు రుణమాఫీ పొందింది.. లేనిది వారి ఖాతాల్లో నిధులు జమ అయ్యింది.. లేనిది తెలుసుకోవచ్చన్నారు. వ్యవసాయ, బ్యాంక్ అధికారుల నుంచి మాత్రమే వివరాలు తెలుసుకోవాలని కలెక్టర్ స్పష్టం చేశారు.
నల్లగొండ: రైతుల రుణమాఫీ సొమ్ము మొత్తం ఈనెల 22 నాటికి వారి ఖాతాల్లో జమచేయాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి బ్యాంకర్లకు సూచించారు. గురువారం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన బ్యాంకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.2 లక్షల వరకు రైతుల రుణాలు మాఫీ చేసేందుకు ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. గురు, శుక్రవారాల్లో రూ.లక్ష రుణాలు ఉన్న రైతుల ఖాతాల్లో రుణమాఫీ జమ చేసేందుకు ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుందన్నారు. రుణమాఫీ పొందిన రైతులకు బ్యాంకు రుణాలను రెన్యువల్ చేయాలని ఆదేశించారు. వచ్చే సోమవారం నుంచి వారం పాటు శ్రీరుణాల రెన్యువల్ డ్రైవ్ఙ్ నిర్వహించాలన్నారు. రుణమాఫీ సమస్యల పరిష్కారానికి జిల్లా వ్యవసాయ శాఖ అధికారి కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసామన్నారు. రుణ మాఫీ సందేహాలపై రైతులు ఫోన్ : 7288800023 నంబర్‌ను సంప్రదించాలన్నారు. మండల వ్యవసాయ అధికారి కార్యాలయంలో కూడా రుణమాఫీకి సంబంధించిన సమస్యలు తెలుపడానికి గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేసామన్నారు. జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్‌కుమార్ మాట్లాడుతూ రూ.లక్షలోపు పంట రుణాలు పొందిన రైతులు జిల్లాలో 83 వేల మంది ఉన్నారన్నారు. ఎల్డీఎం శ్రామిక్ మాట్లాడుతూ 2023–24 ఆర్థిక సంవత్సరానికి జిల్లాలో వ్యవసాయ, అనుబంధ రంగాల్లో రూ.7,417 కోట్ల రుణాలు ఇచ్చి లక్ష్యాలు సాధించామన్నారు. స్వయం సహాయక మహిళా సంఘాలకు బ్యాంకుల అనుసంధానంతో రూ.260 కోట్ల రుణాలను ఇచ్చి రాష్ట్రంలోనే జిల్లాను మొదటి స్థానంలో నిలిపిన బ్యాంకర్లను కలెక్టర్ అభినందించారు. అనంతరం కలెక్టర్ రూ.15,811.91 కోట్ల అంచనాతో రూపొందించిన 2024– 25 జిల్లా వార్షిక రుణ ప్రణాళికను విడుదల చేశారు. సమావేశంలో డీఆర్‌డీఓ నాగిరెడ్డి, ఎస్‌బీఐ ఆర్‌ఎం అలీముద్దీన్, నాబార్డ్ డిప్యూటీ జనరల్ మేనేజర్ వినయ్‌కుమార్, ఆర్బీఐ ఏజీఎం సాయితేజరెడ్డి పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ నారాయణరెడ్డి