
హైదరాబాద్‌లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గోపిదేశి ప్రవీణ్
చిలుకూరు: వారిది నిరుపేద కుటుంబం. రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి. ఈ కుటుంబానికి అనుకోకుండా పెద్ద విపత్తు జరిగింది. దీంతో ఒక్కసారిగా ఆ కుటుంబం కష్టంలో పడింది. చిలుకూరు మండలంలోని సీతారాంపురం గ్రామానికి చెందిన గోపిదేశి వీరబాబు, వెంకటనర్సమ్మకు కుమారుడు ప్రవీణ్ ఉన్నాడు. వీరికి కేవలం 10 గుంటల భూమి ఉంది. వీరబాబు 20 ఏళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. దీంతో వెంకటనర్సమ్మ గ్రామ శివారులో ఉన్న గోదాంలో స్వీపర్‌గా పని చేస్తుంది. ఆమె కుమారుడు ప్లంబర్‌గా పని చేస్తున్నాడు. తల్లి, కుమారుడు ఇద్దరూ కూలీ పనికి వెళ్తూ జీవనం సాగిస్తున్నారు.
ఇంకా రూ.10లక్షలు అవసరం..
గత నెల మార్చి 31న ప్రవీణ్ పని నిమిత్తం కోదాడకు వెళ్లి అనంతరం కోదాడ నుంచి చిలుకూరు మీదుగా స్వగ్రామమైన సీతారాంపురానికి బైక్‌పై వస్తున్నాడు. ఈ క్రమంలో చిలుకూరు వద్ద కారు ఢీ కొని అతడి ఎడమ కన్నుకు తీవ్రంగా గాయమైంది. దీంతో వైద్యులు ఆ కన్నును ఆపరేషన్ చేసి తీసేసారు. కన్ను పూర్తిగా దెబ్బతినడంతో కన్ను ద్వారా తలకు, ఊపిరితిత్తులకు ఇన్‌ఫెక్షన్ వచ్చింది. వైద్యానికి మొత్తం రూ.20 లక్షలు ఖర్చు వస్తుందని వైద్యులు తెలిపారు. తన కొడుకును కాపాడుకునేందుకు తనకు ఉన్న 10 గుంటల భూమిని అమ్మగా వచ్చిన రూ.10 లక్షలు ఆస్పత్రిలో చెల్లించింది. ఇంకా రూ.10లక్షల వరకు అవసరం ఉంది. ప్రస్తుతం అప్పు తీసుకువచ్చి కుమారుడికి వైద్యం చేయిస్తోంది. ఆర్థికంగా స్థోమత లేకపోవడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.
గ్రామస్తుల చేయూత..
ఉన్న భూమిని అమ్మినా వైద్యానికి డబ్బులు సరిపోకపోవడంతో తల్లి అప్పులు చేసి వైద్యం చేయిస్తోంది. విషయం తెలుసుకున్న పలువురు గ్రామస్తులు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంతో కొంత మంది ఆర్థిక సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. మరికొంత మంది చేయూతనందిస్తే తన కుమారుడి ఆరోగ్యం నయం అవుతుందని తల్లి వెంకటనర్సమ్మ పేర్కొంది. తమ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతోంది.
ఆర్థిక సాయం చేయాల్సిన వారు
గన్నా అన్వేష్
అకౌంట్ నంబర్: 50100513510692
ఐఎఫ్‌సీ కోడ్ : హెచ్‌డీఎఫ్‌సీ0001642
బ్రాంచ్ : కోదాడ
ఫోన్ పే లేదా గూగుల్ పే నంబర్ :
99856 26573
రోడ్డు ప్రమాదంలో కుమారుడి
కన్నుకు గాయం
తలకు, ఊపిరితిత్తులకు ఇన్‌ఫెక్షన్
ఆపరేషన్ చేసి కన్ను తీసివేసిన వైద్యులు
వైద్యానికి ఇప్పటికే రూ.20 లక్షలు ఖర్చు
నిరుపేద కుటుంబం కావడంతో
ఆపన్నహస్తం కోసం వేడుకోలు
