బీఆర్‌ఎస్‌లో కంచర్ల ఒక్కరే ఉంటారు | - | Sakshi
Sakshi News home page

బీఆర్‌ఎస్‌లో కంచర్ల ఒక్కరే ఉంటారు

Oct 20 2023 2:04 AM | Updated on Oct 20 2023 10:15 AM

- - Sakshi

మాట్లాడుతున్న వైస్‌చైర్మన్‌ అబ్బగోని రమేష్‌గౌడ్‌, చిత్రంలో గుమ్ముల మోహన్‌రెడ్డి,నాయకులు

నల్లగొండ: నవంబర్‌ 30వ తేదీ నాటికి బీఆర్‌ఎస్‌ పార్టీలో ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి తప్ప ఒక్క నాయకుడు ఉండడని.. కౌన్సిలర్లు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జెడ్పీటీలు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరతారని కాంగ్రెస్‌ పార్టీ నల్లగొండ పట్టణ అధ్యక్షుడు గుమ్ముల మోహన్‌రెడ్డి, మున్సిపల్‌ ఫ్లోర్‌లీడర్‌ బుర్రి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు.

బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌ పార్టీలో చేరిన మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ అబ్బగోని రమేష్‌, బోయినపల్లి శ్రీనివాస్‌, ఖయూమ్‌బేగ్‌, బషీర్‌, సమీలతో కలిసి గురువారం నల్లగొండలోని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరిన కౌన్సిలర్లను సంతలో పశువుల్లా కొంటున్నారని అనడాన్ని వారు తీవ్రంగా ఖండించారు.

నాలుగేళ్ల పాటు కౌన్సిలర్లు, నాయకులు బీఆర్‌ఎస్‌లో గౌరవం లేకున్నా మనసు చంపుకొని పనిచేశారు. ఇంకా ఆత్మాభిమానం చంపుకోలేక తిరిగి కాంగ్రెస్‌లో చేరారన్నారు. ఎంపీ కోమటిరెడ్డితోపాటు కౌన్సిలర్లను విమర్శిస్తే సహించేది లేదన్నారు. చివరకు నీలగిరి మున్సిపల్‌ చైర్మన్‌ కూడా కాంగ్రెస్‌ పార్టీలోకి రాక తప్పదన్నారు. వచ్చే ఎన్నికల్లో 50 వేల మెజార్టీతో కోమటిరెడ్డి గెలువడం ఖాయమని, నీవు నీ సొంత ఊరు ఉరుమడ్ల గ్రామబాట పట్టక తప్పదన్నారు.

వైస్‌ చైర్మన్‌ అబ్బగోని రమేష్‌ మాట్లాడుతూ నాలుగేళ్ల పాటు నీతో జర్నీ చేసి వేదనకు గురయ్యామన్నారు. రేపు ప్రజల్లో ఎవరి బలం ఎంతో తేల్చుకుందామన్నారు. సమావేశంలో జెడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్య, కౌన్సిలర్లు బొజ్జ శంకర్‌, గోగుల రాములమ్మ, గడిగ శ్రీను హిమబిందు, బుర్రి రజిత యాదయ్య, కేసారి వేణుగోపాల్‌రెడ్డి, ఏర్పుల రవి, సమద్‌, నాయకులు అనూప్‌రెడ్డి, జూకూరి రమేష్‌, ఎంపీటీసీలు గరి చైతన్య, పాండు, కరుణాకర్‌రెడ్డి, సైదులు, సురేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మళ్లీ.. కాంగ్రెస్‌లోకి నల్లగొండ ఎంపీపీ
నల్లగొండ ఎంీపీపీ మనిమిద్దె సుమన్‌ గురువారం హైదరాబాద్‌లో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సమక్షంలో తిరిగి కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. రెండు రోజుల క్రితం కాంగ్రెస్‌ను వీడి బీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకున్న సుమన్‌ మరలా సొంతగూటికి చేరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement