భారీగానే.. గౌరవం!
ఉద్యోగుల హెచ్‌ఆర్‌ఏ పెంపు
సాక్షి ప్రతినిది, నల్లగొండ : నల్లగొండ కార్పొరేషన్‌లో మేయర్ అయ్యే రూ.65 వేల గౌరవ వేతనం అందనుంది. నీలగిరి మున్సిపాలిటీ.. కార్పొరేషన్ కావడంతో ఆ మేరకు ప్రజాప్రతినిధులకు, ఉద్యోగులకు ప్రయోజనాలు లభించనున్నాయి. కార్పొరేషన్‌లో డిప్యూటీ మేయర్‌కు, కార్పొరేటర్లకు కూడా గౌరవ వేతనాలు భారీగా లభించనున్నాయి. కార్పొరేషన్ పరిధిలో వివిధ శాఖల్లో పనిచేసే దాదాపు 2 వేల మంది ఇంటి అద్దె అలవెన్స్ (హెచ్‌ఆర్‌ఏ) కూడా పెద్ద మొత్తంలో పెరగనుంది.
భారీగా ఆర్థిక ప్రయోజనం
మేయర్ అయ్యే వారికి పెద్ద మొత్తంలో ఆర్థిక ప్రయోజనం చేకూరనుంది. ఇప్పటివరకు మున్సిపాలిటీలో చైర్మన్‌గా ఉన్న వారికి నెలకు రూ.19,500 గౌరవ వేతనం ఉంది. ఇప్పుడు కార్పొషన్‌లో మేయర్ అయ్యే వారికి నెలకు రూ.65 వేల వేతనం లభించనుంది. ఇక మున్సిపల్ వైస్ చైర్మన్‌కు నెలకు రూ.9,750 గౌరవ వేతనం ఉండగా.. డిప్యూటీ మేయర్‌గా ఎన్నికయ్యే వారికి నెలకు రూ.32,500 గౌరవ వేతనం లభించనుంది.
కార్పొరేటర్లకు రూ.7,800 వేతనం
ఇప్పటి వరకు మున్సిపల్ కౌన్సిలర్‌గా పని చేసిన వారికి నెలకు రూ.4,550 గౌరవ వేతనం ఉండేది. నల్లగొండ కార్పొరేషన్ కావడంతో కౌన్సిలర్ స్థానం కార్పొరేటర్‌గా మారనుంది. దీంతో కార్పొరేటర్‌గా గెలిచే వారికి ప్రతి నెలా గౌరవ వేతనం రూ.7500 లభించనుంది. నల్లగొండ కార్పొరేషన్ పరిధిలో త్వరలో జరిగే ఎన్నికల్లో గెలుపొందే 48 మంది కార్పొరేటర్లకు ఇది వర్తించనుంది.
కార్పొరేషన్ పరిధిలో రూ.2 లక్షలకుపైగా జనాభా ఉంటే కార్పొరేషన్ పరిధిలో పనిచేసే అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగులకు హెచ్‌ఆర్‌ఏ పెరగనుంది. ప్రస్తుతం నల్లగొండ 2,43,615 జనాభాతో కార్పొరేషన్‌గా అవతరించబోతోంది. దీంతో కార్పొరేషన్ పరిధిలో పనిచేసే దాదాపు రెండు వేల మంది ఉద్యోగులకు హెచ్‌ఆర్‌ఏ పెరగనుంది. ప్రధానంగా కలెక్టరేట్ పరిధిలో 500 మంది వరకు ఉద్యోగులు ఉండగా, జిల్లా వైద్యారోగ్య శాఖ, ప్రభుత్వ ఆస్పత్రి, వైద్య కళాశాల, వ్యవసాయ, సంక్షేమ, విద్య, పోలీసు ఇతరత్రా అన్ని శాఖలకు చెందిన ఉద్యోగులు జిల్లా కేంద్రంలోని వివిధ శాఖల కార్యాలయాల్లో పని చేస్తున్నారు. ప్రస్తుతం 50 వేలకు పైగా జనాభా కలిగిన మున్సిపాలిటీలో వారికి 13 శాతం హెచ్‌ఆర్‌ఏ వస్తోంది. ఇక కార్పొరేషన్ కానుండడంతో ఇక్కడ 17 శాతం హెచ్‌ఆర్‌ఏ లభించనుంది. దీంతో ఉద్యోగులకు కూడా ఆర్థిక ప్రయోజనం చేకూరనుంది.
ఫ నీలగిరి కార్పొరేషన్‌లో
ప్రజాప్రతినిధులకు పెరగనున్న
గౌరవ వేతనాలు
ఫ ఉద్యోగుల హెచ్‌ఆర్‌ఏ కూడా 17 శాతానికి పెరుగుదల
ఫ రెండు వేల మంది ఉద్యోగులకు ప్రయోజనం


