కాంగ్రెస్‌లోకి మోత్కుపల్లి? | Motkupalli Narasimhulu To Join Congress Party | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌లోకి మోత్కుపల్లి?

Sep 30 2023 6:18 AM | Updated on Sep 30 2023 9:53 AM

బెంగళూరులో కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ను కలిసిన మోత్కుపల్లి నర్సింహులు - Sakshi

బెంగళూరులో కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ను కలిసిన మోత్కుపల్లి నర్సింహులు

సాక్షి, యాదాద్రి : మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత మోత్కుపల్లి నర్సింహులు కాంగ్రెస్‌లో చేరేందుకు రంగం సిద్ధమైంది. అసెంబ్లీ టికెట్‌ ఇస్తానని తనకు హామీ ఇచ్చిన కేసీఆర్‌.. ఆరు నెలలుగా అపాయింట్‌మెంట్‌ కూడా ఇవ్వకపోవడంతో హస్తం గూటికి చేరాలని డిసైడ్‌ అయ్యారు. శుక్రవారం ఆయన బెంగళూరులో కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌తో భేటీ అయ్యారు. తుంగతుర్తి టికెట్‌ ఇవ్వాలని కోరగా అందుకు డీకే సానుకూలత వ్యక్తం చేయడంతో త్వరలో కాంగ్రెస్‌లో చేరేందుకు రెడీ అవుతున్నట్ల్లు తెలుస్తోంది.

ఏ పదవీ దక్కని మోత్కుపల్లి
రానున్న ఎన్నికల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఎక్కడో ఒక చోట నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని మోత్కుపల్లి పర్సింహులు తన అభిప్రాయాన్ని పలుమార్లు వెల్లడించారు. అయితే సీఎం కేసీఆర్‌ సిట్టింగులకే సీట్లు కేటాయించడంతో ఆ అవకాశం లేకుండాపోయింది. కాగా బీఆర్‌ఎస్‌ పార్టీలో ఉన్న మోత్కుపల్లి.. కేసీఆర్‌ను నేరుగా కలిసి మాట్లాడాలని ఆరు నెలలుగా ప్రయత్నిస్తున్నా అవకాశం ఇవ్వడంలేదని ఆయన మీడియా ముఖంగా ఆవేదన వ్యక్తం చేశారు. హుజురాబాద్‌ ఎన్నికల సందర్భంగా ప్రభుత్వం తీసుకువచ్చిన దళితబంధు పథకం చైర్మన్‌ లేదా ఎమ్మెల్సీ, రాజ్యసభ ఏదో ఒక పదవి దక్కుతుందన్న ఆశతో ఉన్న మోత్కుపల్లికి ఏ అవకాశం కేసీఆర్‌ కల్పించలేదు.

తుంగతుర్తి నుంచి పోటీకి సంసిద్ధత
ఉమ్మడి జిల్లాలో సీనియర్‌ నేతగా ఉన్న మోత్కుపల్లి వచ్చే ఎన్నికల్లో తుంగతుర్తి నుంచి అసెంబ్లీకి పోటీ చేయడానికి సంసిద్ధత వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని ఇటీవల నియోజకవర్గంతో పాటు పలు చోట్ల మీడియా సమావేశాల్లో మోత్కుపల్లి అనుచరులు ప్రకటించారు. అయితే బీఆర్‌ఎస్‌ నుంచి టికెట్‌ ఆశించినా సిట్టింగ్‌ కోటాలో తుంగతుర్తి నుంచి గాదరి కిషోర్‌కుమార్‌కు మూడవ సారి టికెట్‌ లభించింది. ఆలేరులో ఐదు సార్లు (టీడీపీ, ఇండిపెండెంట్‌, కాంగ్రెస్‌), తుంగతుర్తి నుంచి టీడీపీ తరఫున ఒకసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1999లో కాంగ్రెస్‌ నుంచి ఆలేరు ఎమ్మెల్యేగా గెలిచిన మోత్కుపల్లి అనంతరం టీడీపీలో చేరారు.అయితే తాజా పరిస్థితుల నేపధ్యంలో మరోసారి కాంగ్రెస్‌ నుంచి తుంగతుర్తిలో పోటీకి సిద్ధం అవుతున్నారు.

ఖర్గే సమక్షంలో కాంగ్రెస్‌లోకి?
ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో త్వరలో కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకోనున్నట్లు కాంగ్రెస్‌ నాయకుడొకరు చెప్పారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో సహ జిల్లాలోని ముఖ్యనేతలంతా కొంత కాలంగా మోత్కుపల్లితో టచ్‌లో ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి జిల్లాలో పార్టీకి సీనియర్‌ నేతగా కాంగ్రెస్‌లోకి ఆహ్వానిస్తున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్ర నేతల సూచన మేరకు బెంగళూరులో డీకే శివకుమార్‌ను కలిశారు. మాజీ ఉప ముఖ్య మంత్రి దామోదర రాజనర్సింహ హైదారాబాద్‌లోని మోత్కుపల్లి ఇంటికి వచ్చి సుదీర్ఘంగా చర్చించడంతోపాటు కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు.

అలాగే జిల్లాలో సీనియర్‌ నేత మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు మోత్కుపల్లిని పార్టీలోకి రావాలని కోరినట్లు సమచారం. అయితే ఉమ్మడి జిల్లాలో పేరున్న మోత్కుపల్లి కాంగ్రెస్‌లో చేరిక బీఆర్‌ఎస్‌కు నష్టమేనని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement