గోరటి వెంకన్నకు అరుదైన గౌరవం 

TS Tribute To Gorati Venkanna By Giving MLC - Sakshi

గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీ పదవి 

తెలంగాణ ఉద్యమంలో వెంకన్నది కీలకపాత్ర

ఎన్నో అవార్డులు, విదేశాల్లోనూ సత్కారాలు  

సాక్షి, నాగర్‌కర్నూల్‌: శానసమండలిలో ఖాళీగా ఉన్న గవర్నర్‌ నామినేటెడ్‌ ఎమ్మెల్సీ స్థానానికి ప్రముఖ ప్రజాకవి, వాగ్గేయకారుడు గోరటి వెంకన్న పేరును రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. తెలంగాణ ఉద్యమంలో తమ ఆట పాటలతో ప్రజలను చైతన్యవంతుల్ని చేసిన ఈయనకు అరుదైన గౌరవం కల్పించింది. పల్లె కన్నీరు పెడుతోందో.. అని తెలంగాణ ప్రజాజీవితాన్ని ప్రపంచానికి చాటిన జానపద కవి, గాయకుడు గోరటి వెంకన్న. తెలంగాణ భాష, యాసను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రత్యేక ఉద్యమ ఆకాంక్షను మరింత బలోపేతం చేశారు. చదవండి: (ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేసిన కేసీఆర్‌ )

విద్యార్థి దశ నుంచే ఉద్యమాల పాటలకు నాంది పలికారు. ఎన్నో పుస్తకాలు రాశారు. ఎన్నో అవార్డులు అందుకున్నారు. విదేశాల్లోనూ సత్కారాలు పొందారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా తెల్కపల్లి మండలం గౌరారానికి చెందిన గోరటి నర్సింహ, ఈరమ్మ మొదటి సంతానం గోరటి వెంకన్న. ఎంఏ (తెలుగు) విద్యాభ్యాసం చేసిన ఈయన ప్రస్తుతం ఏఆర్‌ సబ్‌ డివిజనల్‌ కో–ఆపరేటివ్‌ ఆఫీసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. పలు సినిమాలకు పాటలు రాశారు. ఎన్‌కౌంటర్, శ్రీరాములయ్య, కుబుసం సినిమాల్లో రాసిన పాటలను మంచి పేరు వచ్చింది. బతుకమ్మ చిత్రంలో పాటలు రాయడంతో పాటు నటించారు.  

రాసిన పుస్తకాలు..  
ప్రజాకవి గోరటి వెంకన్న రాసిన అనేక పుస్తకాలు అచ్చయ్యాయి. 1994లో ఏకునాదం మోత, 2002లో రేలపూతలు పుస్తకాలు రాసి 2007లో తెలుగు యూనివర్సిటీ నుంచి ఉత్తమ గేయ కావ్య పురస్కారం అందుకున్నారు. 2010లో అలసేంద్రవంక, 2016లో పూసిన పున్నమి, 2019లో వల్లంకి తాళం, 2019లో ద వేవ్‌ ఆఫ్‌ ద క్రెస్‌సెంట్‌ వంటి పుస్తకాలను రాసి అవార్డులు అందుకున్నారు.

అవార్డులు ఇవే..  
2019లో మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం ‘కబీర్‌ సమ్మాన్‌’ జాతీయ అవార్డును అందించింది. 2006లో హంస అవార్డు, 2016లో తెలంగాణ ప్రభుత్వం కాళోజీ అవార్డు, 2014లో ఉగాది పురస్కారం, 2019లో తెలంగాణ సారస్వత పరిషత్‌ నుంచి సినారే అవార్డు, లోక్‌నాయక్‌ అవార్డు, 2018లో తెలంగాణ మీడియా అకాడమి నుంచి అరుణ్‌సాగర్‌ అవార్డు, 2007లో అధికార భాషా సంఘం పురస్కారం అందుకున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top