అమ్రాబాద్: మద్దిమడుగులో గురువారం సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ అన్నారు. మంగళవారం ఎస్పీ సంగ్రామ్ సింగ్‌జీ పాటిల్, సీఎం కార్యాలయ భద్రతా అధికారులతో కలిసి మద్దిమడుగులో సీఎం పర్యటన ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. హెలీప్యాడ్ దిగే స్థలం, సభాస్థలం, విగ్రహ శంకుస్థాపన ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం ఆలయ కమిటీ చైర్మన్ హాల్‌లో ఎమ్మెల్సీ శంకర్‌నాయక్‌తో కలిసి అన్నిశాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. సీఎం పర్యటన నేపథ్యంలో చేపడుతున్న పనుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సేవాలాల్ విగ్రహ శంకుస్థాపన కోసం ముఖ్యమంత్రి రానుండటంతో.. పర్యటనకు వచ్చే ప్రజలు అసౌకర్యానికి గురికాకుండా అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా ముందస్తు ప్రణాళికతో ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలన్నారు. ముఖ్యమంత్రి 5 వేల మంది గిరిజనులతో ముఖాముఖి కార్యక్రమం ఉంటుందని అందుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వేదిక సిద్ధం చేయాలన్నారు. వారి వెంట డీఎస్పీ శ్రీనివాసులు తదితరులున్నారు.


