కందనూలు: నల్లగొండకు పాలమూరు నీటి తరలింపుపై మంత్రులు, ఎమ్మెల్యేలను జిల్లా ప్రజలు నిలదీయాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకుడు నాగం జనార్దన్‌రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం జిల్లా కేంద్రంలోని తన నివాసంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో సున్నపురాళ్ల తండా నుంచి కుడికిళ్ల వరకు చేపట్టిన పనులను పూర్తిచేసి.. డిండి ప్రాజెక్టుకు సాగునీటిని తరలించేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. గత ప్రభుత్వంలోనే పాలమూరు ఎత్తిపోతల పథకంలోని నార్లాపూర్, ఏదుల, వట్టెం రిజర్వాయర్లను పూర్తి చేయడం జరిగిందని.. ప్రస్తుతం కాల్వల సామర్థ్యం పెంచడంతో పాటు చిన్న చిన్న మరమ్మతులను పూర్తిచేయలేని పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందన్నారు. మంత్రి జూపల్లి కృష్ణారావు కక్కుర్తి వల్లే నేడు కాల్వల సామర్థ్యం తగ్గి, పూర్తి ఆయకట్టుకు సాగునీరు అందడం లేదన్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యం వీడి ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టుల పనులను వెంటనే పూర్తిచేయాలని ఆయన డిమాండ్ చేశారు. సమావేశంలో నాయకులు బాలాగౌడ్, లక్ష్మయ్య, కౌన్సిలర్ అర్జునయ్య, సత్యం, భీముడు, భీమయ్య, అహ్మద్ ఉన్నారు.
● పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడంలో నిర్లక్ష్యం వీడాలి
● మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి


