మత్తులో మారిన మకామ్‌..! | - | Sakshi
Sakshi News home page

మత్తులో మారిన మకామ్‌..!

Nov 18 2026 12:50 AM | Updated on Nov 18 2026 12:50 AM

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌: ఉమ్మడి పాలమూరు జిల్లాలో కల్తీ కల్లు మాఫియా తన పంథాను మార్చుకుంది. ఇప్పటివరకు కర్ణాటకలోని రాయచూర్‌, ఏపీలోని పలు ప్రాంతాల నుంచి క్లోరల్‌ హైడ్రేట్‌ (సీహెచ్‌), అల్ప్రాజోలం, డైజోఫాం వంటి నిషేధిత ప్రమాదకర మత్తు పదార్థాలను గుట్టుచప్పుడు కాకుండా దిగుమతి చేసుకుని కల్లులో కలిపి విక్రయించేవారు. నిఘా పెరగడం, రవాణా ఖర్చులు తడిసిమోపెడు కావడంతో కల్తీ కల్లు దందాదారులు స్థానికంగానే మత్తు పదార్థాల తయారీకి శ్రీకారం చుట్టారు. డైజోఫాం, సీహెచ్‌ తయారీ కష్టతరం కావడంతో ప్రధానంగా ఆల్ఫ్రాజోలం తయారీ కేంద్రాలను ఏర్పాటు చేయిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని పలు కల్లు దుకాణాల నిర్వాహకులు తమకున్న పరిచయాల ద్వారా దందాలో ఆరితేరిన వారిని పురమాయిస్తున్నారు. వారి అండదండలతో పలు ప్రాంతాల్లో ఈ డ్రగ్స్‌ తయారీ గుట్టుచప్పుడు కాకుండా జోరుగా సాగుతున్నట్లు తెలుస్తోంది.

గతంలో భూత్పూర్‌లో..

ఈ ఏడాది జూలైలో మహబూబ్‌నగర్‌ జిల్లా భూత్పూర్‌ మండలం అన్నాసాగర్‌ శివారులోని ఓ పౌల్ట్రీఫాంపై మాదక ద్రవ్యాల నిరోధక ప్రత్యేక బృందం ఈగల్‌ ఫోర్స్‌ దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. రూ.20.30 లక్షల విలువైన 1.150 కిలోల అల్ప్రాజోలంతో పాటు తయారీ పరికరాలు సీజ్‌ చేసింది.

తాజాగా బిజినేపల్లిలో..

ఈ నెల 15న నాగర్‌కర్నూల్‌ జిల్లా బిజినేపల్లి శివారు ఓ వ్యవసాయ పొలంలోని రేకుల షెడ్డులో మూడు నెలలుగా సాగుతున్న అల్ప్రాజోలం తయారీ ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. కర్ణాటక రాష్ట్రంలోని రాయచూర్‌ నుంచి ముడిసరుకు తెప్పించి.. ఏపీలోని కడపలో ప్రాథమిక ప్రక్రియ పూర్తి చేసి.. బిజినేపల్లిలో తుదిరూపం ఇస్తున్న ఈ అంతర్రాష్ట్ర ముఠా నుంచి పోలీసులు రూ.38 లక్షల విలువైన 2.6 కిలోల అల్ప్రాజోలం, కెమికల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.

పంట పొలాలు, పౌల్ట్రీ ఫాంలే అడ్డాలు

పోలీసులు, ఎకై ్సజ్‌ అధికారుల కళ్లుగప్పేందుకు అల్ప్రాజోలం తయారీదారులు ఊరికి దూరంగా ఉండే వ్యవసాయ క్షేత్రాలు, కోళ్ల ఫారాలను కేంద్రాలుగా మార్చుకుంటున్నారు. కల్తీ కల్లు మాఫియా అండతో జనసంచారం లేకుండా, నిర్మానుష్య ప్రాంతాలను ఎంచుకుని దందా కొనసాగిస్తున్నారు. వివిధ రాష్ట్రాల నుంచి ముడి సరుకులను తెప్పించుకుని, తయారీకి కావాల్సిన పరికరాలు, సామగ్రిని సమకూర్చుకుని ఇక్కడే మత్తు పదార్థాన్ని తయారు చేస్తున్నారు. భూత్పూర్‌, బిజినేపల్లిలో అల్ప్రాజోలం తయారీ ముఠా పట్టుబడడమే ఇందుకు ఉదాహరణగా నిలుస్తుండగా.. ఉమ్మడి మహబూబ్‌నగర్‌లోని మక్తల్‌, కోస్గి తదితర ప్రాంతాల్లో సైతం మత్తు పదార్థాల తయారీ కేంద్రాలు కొనసాగుతున్నట్లు సమాచారం.

రూటు మార్చిన కల్తీ కల్లు మాఫియా.. స్థానికంగానే మత్తుపదార్థాల తయారీ

కల్లు దుకాణాదారుల అండతో వెలుస్తున్న అల్ప్రాజోలం తయారీ కేంద్రాలు

గతంలో భూత్పూర్‌, తాజాగా బిజినేపల్లి శివారులో ముఠా గుట్టురట్టు

పోలీసుల విచారణలో పాలమూరులోని పలువురు నిర్వాహకుల పేర్లు..

ఈగల్‌ ఫోర్స్‌ చేతికి చిట్టా.. కూపీ లాగుతున్న బృందం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement