నాగర్‌కర్నూల్: ఎల్‌నినో ప్రభావంతో రానున్న యాసంగిలో నీటి ఎద్దడి తలెత్తే ప్రమాదం ఉందన్న అంచనాల నేపథ్యంలో ప్రభుత్వం పంటల సాగు ప్రణాళికపై పునరాలోచన చేసింది. తొలుత క్రాప్ హాలిడే ప్రకటించే దిశగా ఆలోచించినా.. ఆ తర్వాత ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టిసారించింది. వరి వంటి నీటి వినియోగం అధికంగా ఉండే పంటలకు బదులు ఆరుతడి పంటలు సాగు చేయాలని రైతులకు సూచిస్తోంది. 2026– 27 యాసంగికి రూపొందించిన అంచనాల్లో వరి సాగు విస్తీర్ణాన్ని సున్నాగా చూపగా.. ఉద్యాన, ఇతర పంటలు కలిపి 3,34,257 ఎకరాల్లో సాగు జరగవచ్చని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఇప్పటికే వేరుశనగ విత్తనం వేయడం పూర్తి కాగా.. మిగిలిన పంటల సాగుకు అవసరమైన విత్తనాలు, ఎరువుల లభ్యత కీలకంగా మారింది. అందుకు అనుగుణంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది.
గతేడాది కంటే తక్కువ..
జిల్లాలో సాధారణ యాసంగి సాగు విస్తీర్ణం 3,38,295 ఎకరాలు. గత యాసంగిలో 4,74,591 ఎకరాల్లో పంటలు సాగు కాగా.. ఈసారి 3,34,257 ఎకరాల్లోనే సాగు జరగవచ్చని అంచనా వేసింది. గతేడాదితో పోలిస్తే 1,40,334 ఎకరాల మేర సాగు తగ్గే అవకాశం ఉంది. సాధారణ విస్తీర్ణంతో పోల్చినా 4,038 ఎకరాలు తక్కువగా ఉంది. నీటి లభ్యతపై ఆందోళనలు, ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో పంటల ఎంపికలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి.
వేరుశనగకు ప్రాధాన్యం..
జిల్లా రైతులు ప్రస్తుత యాసంగి సీజన్‌లో ఆరుతడి పంటలలో భాగంగా వేరుశనగ సాగుకు ప్రాధాన్యం ఇచ్చారు. ఇప్పటికే విత్తనం వేయడం సైతం పూర్తయింది. వ్యవసాయ శాఖ అంచనాల ప్రకారం జిల్లాలో 1,26,900 ఎకరాల్లో వేరుశనగ సాగు జరగనుంది. వాస్తవానికి రాష్ట్రంలోనే వేరుశనగ సాగులో నాగర్‌కర్నూల్ జిల్లా మొదటి స్థానంలో ఉంటుంది. ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావం, కరెంట్ సమస్యతో కాస్త తక్కువ విస్తీర్ణంలో సాగైంది. మరోవైపు 1,45,635 ఎకరాల్లో మొక్కజొన్న సాగు అంచనా వేయగా.. నల్ల మినుములు 40,530, ఆముదం 7,580, జొన్న 4 వేల ఎకరాల్లో సాగు కావచ్చని అంచనా. పంటల మార్పిడితో నీటి వినియోగాన్ని తగ్గించడంతోపాటు రైతులకు ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలు కల్పించడంపై దృష్టి పెట్టాల్సి ఉంది.
పంట సాధారణ ప్రస్తుత సీజన్
సాగు విస్తీర్ణం అంచనా
మొక్కజొన్న 2,05,935 1,45,635
వరి 1,69,128 0
నల్ల మినుములు 10,661 40,530
ఆముదం 1,468 7,580
జొన్న 1,463 400
నువ్వులు 257 457
పెసర 239 634
శనగ 154 794
పశుగ్రాసం 288 1,397
కందులు 125 625
అలసందలు 64 60
పొద్దుతిరుగుడు 57 46
సజ్జ 27 33
ఇతర పంటలు 227 1,064
ఎల్‌నినో ఎఫెక్ట్‌తో వరి సాగుకు దూరంగా ఉండాలని సర్కారు సూచన
ప్రస్తుత యాసంగిలో వరి సాగు లక్ష్యం సున్నా..
3.34 లక్షల ఎకరాల్లో ఇతర పంటల అంచనా
జిల్లాలో ఇప్పటికే వేరుశనగ సాగు పూర్తి..
మొక్కజొన్న, నల్ల మినుములపై ప్రధానంగా దృష్టి


