కల్వకుర్తి రూరల్: ప్రస్తుతం నెలకొన్న వర్షాభావ పరిస్థితుల్లో రైతులు వరిని పూర్తిగా తగ్గించి ఆరుతడి పంటలు సాగు చేయాలని కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ అన్నారు. ప్రత్యామ్నాయ పంటలు, పందిరి కూరగాయల సాగుతో రైతులకు అధిక లాభాలు వస్తాయని పేర్కొన్నారు. మంగళవారం మండలంలోని ముకురాల, పంజుగుల, లింగసానిపల్లి గ్రామాల్లో ఆయన పర్యటించి రైతులు చేపట్టిన పంట సాగు విధానాలను పరిశీలించారు. పంటల సాగు విధానం, పెట్టుబడి వ్యయం, దిగుబడులు, మార్కెటింగ్ అవకాశాలు, ఆదాయం తదితర అంశాలపై నేరుగా రైతులను అడిగి తెలుసుకున్నారు. ముకురాలలో రైతు రాజేందర్‌రెడ్డి 6 ఎకరాలలో చేపట్టిన పందిరి కూరగాయలు, చిక్కుడు పంట సాగును పరిశీలించారు. ఈ విధానంలో మొక్కల పెంపకం, పంటల నిర్వహణ, నీటి వినియోగం, దిగుబడి వివరాలు తెలుసుకున్నారు. సంప్రదాయ పంటలతో పోలిస్తే ప్రత్యామ్నాయ పంటల సాగు ద్వారా ఎంత మేర ఆదాయం లభిస్తుందో చర్చించారు. అదే గ్రామంలో బొప్పాయి తోటను పరిశీలించి మొక్కల పెరుగుదల, దిగుబడి, ఖర్చులపై ఆరాతీశారు. వరికి అధికంగా నీరు అవసరం అవుతుంది కాబట్టి కూరగాయలు, నూనె గింజలు, చిరుధాన్యాలు వంటి ఆరుతడి పంటలు ప్రణాళికాబద్ధంగా సాగు చేస్తే నీటిని పొదుపు చేయడంతోపాటు రైతులు అధిక ఆదాయం సాధించే అవకాశం ఉందన్నారు. అనంతరం పంజుగుల పాఠశాలను తనిఖీ చేసి విద్యార్థుల హాజరు శాతం, విద్యా బోధన, మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన బోధనతోపాటు పౌష్టికాహారం అందించడమే ప్రభుత్వ లక్ష్యం అన్నారు. అనంతరం గ్రామంలో ఉపాధి హామీ పనులను పరిశీలించి.. గ్రామీణ ప్రాంత పూరీలకు నిరంతర ఉపాధి కల్పించడంతోపాటు గ్రామంలో శాశ్వతంగా ఉపయోగపడే ఆస్తుల నిర్మాణానికి అధికారులు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. గ్రామంలో దాసరి లక్ష్మమ్మ మహిళా సంఘం ఆధ్వర్యంలో 400 చ.మీ., విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన షెడ్ నెట్ హౌస్ యూనిట్‌ను పరిశీలించారు. మహిళా సంఘాలు వ్యవసాయ రంగంలో ఆధునిక సాంకేతికతను వినియోగించుకొని ఆర్థికంగా బలోపేతం కావాలని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా ఉద్యానవన అధికారి జగన్, తహసీల్దార్ ఇబ్రహీం, ఏడీఏ మంజుల, ఏఓ సురేష్, హెచ్‌ఓ మల్లీశ్వరి, ఎంపీడీఓ యాదయ్య, సర్పంచులు ఎల్లయ్య, పరశురాములు తదితరులు పాల్గొన్నారు.


