బల్మూర్: ఉమామహేశ్వర ప్రాజెక్టు భూ సేకరణపై నిర్వహించిన ప్రజాభిప్రాయ గ్రామసభలో నిర్వాసిత రైతులు తీవ్ర ఆగ్రహం, ఆవేదన వ్యక్తం చేశారు. తరతరాలుగా సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న భూములను ప్రాజెక్టు కోసం ఇస్తే.. తమ కుటుంబాలు రోడ్డున పడతాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాణాలైనా వదులుకుంటాం.. కానీ, తమ భూములు మాత్రం ఇవ్వం అని పలువురు రైతులు తేల్చిచెప్పారు. ప్రభుత్వం పునరాలోచించి ప్రాజెక్టును మరోచోట నిర్మించాలని డిమాండ్ చేయగా.. మరికొందరు రైతులు భూములు కోల్పోతున్న నిర్వాసితులకు మార్కెట్ విలువ ప్రకారం న్యాయమైన పరిహారం చెల్లించాలని కోరారు. మండలంలోని మైలారం గ్రామంలో మంగళవారం ఉమామహేశ్వర ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి భూ సేకరణ కోసం సర్పంచ్ సరిత అధ్యక్షతన ప్రత్యేక గ్రామసభ నిర్వహించారు. గ్రామసభలో మైలారం శివారులోని 168.3 ఎకరాల భూమిని సేకరించేందుకు అధికారులు ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టగా.. భూములు కోల్పోతున్న రైతుల నుంచి అభిప్రాయాలు, అభ్యంతరాలను అధికారులు స్వీకరించారు.
ప్రాజెక్టును మరోచోట నిర్మించాలి
గ్రామసభలో రైతులు మాట్లాడుతూ వ్యవసాయ భూములే తమ కుటుంబాలకు జీవనాధారమని, వాటిని కోల్పోతే ఉపాధి లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాజెక్టు నిర్మాణం వల్ల తమ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారుతుందని వాపోయారు. ప్రభుత్వం తమ పరిస్థితిని అర్థం చేసుకుని భూ సేకరణ నిర్ణయంపై పునరాలోచించాలని, తమ అభ్యంతరాలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.
పేర్లలో తప్పులు సరిచేసుకోవాలి
భూములు కోల్పోతున్న రైతుల అభ్యంతరాలు, అభిప్రాయాలను అధికారులు నమోదు చేశారు. అనంతరం వాటిని గ్రామసభలో చదివి వినిపించారు. భూ రికార్డుల్లో రైతుల పేర్లు తప్పుగా నమోదై ఉంటే సంబంధిత వివరాలను అధికారులకు అందించి సరిచేసుకోవాలని భూసేకరణ ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ అరుణారెడ్డి సూచించారు. గ్రామసభలో రైతులు వ్యక్తం చేసిన అభిప్రాయాలను రికార్డు చేసి ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు. భూములు కోల్పోతున్న రైతులకు న్యాయం జరిగేలా చూడాలని గ్రామస్తులు అధికారులను కోరారు. కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీకాంత్, ఇరిగేషన్ డీఈ బాలస్వామి, ఆర్‌ఐ సీతారాం, కార్యదర్శి నిరంజన్, భూ నిర్వాసిత రైతులు, ప్రజలు పాల్గొన్నారు.
ఉమామహేశ్వర ప్రాజెక్టు భూ సేకరణ గ్రామసభలో మైలారం నిర్వాసితరైతుల ఆగ్రహం
ప్రాజెక్టును మరోచోట నిర్మించాలి..
లేదంటే న్యాయమైన పరిహారం చెల్లించాలి


