కందనూలు: ీసపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ పద్ధతిని అమలు చేయాలని కోరుతూ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు సీపీఎస్ ఉద్యోగులు మంగళవారం సామూహిక సెలవు పెట్టి కలెక్టరేట్‌లో సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మీనర్సింహారావు మాట్లాడుతూ 2023లో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా నూతన పెన్షన్‌ను రద్దు చేసి పాత పెన్షన్ అమలు చేయాలనీ డిమాండ్ చేశారు. ప్రతి ఉద్యోగి తన ఉద్యోగ జీవితంలో దాదాపు 25– 30 ఏళ్లు ఉద్యోగం చేసి చివరకు రిటైర్మెంట్ అయ్యాక ఆ ఉద్యోగికి ఎలాంటి పెన్షన్ లేకపోతే కుటుంబ పోషణ కష్టతరంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగి జీవిత చరమాంకంలో ప్రభుత్వానికి చేసిన సేవలకు ప్రతిఫలం దక్కకపోతే ఆ ఉద్యోగి ఎలా జీవితాన్ని కొనసాగిస్తాడని ప్రశ్నించారు. ప్రజా ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలు పరిష్కరించి వారికి అండగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు సైదులు, కోశాధికారి శ్రీనివాసులు, కల్వకుర్తి, అచ్చంపేట డివిజన్ అధ్యక్షులు రాజేందర్, తేజ తదితరులు పాల్గొన్నారు.


