కోడేరు: ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని.. ప్రజల నుంచి వచ్చిన ప్రతి వినతిని క్షుణ్ణంగా పరిశీలించి క్షేత్రస్థాయిలో విచారణ జరిపి వారికి న్యాయం చేయాలని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శనివారం కోడేరులో బస్టాండ్ వద్ద నిర్వహించిన మండల స్థాయి అధికారుల సమీక్ష సమావేశంలో కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్‌తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజల సమస్యలు పరిష్కరించకుండా కాలయాపన చేయడం, ఒక శాఖ నుంచి మరో శాఖకు పంపుతూ దాటవేత ధోరణి అవలంభిస్తే సహించేది లేదన్నారు. ఈ క్రమంలోనే కొల్లాపూర్ ఆర్డీఓ బన్సీలాల్, కోడేరు తహసీల్దార్ జమీల్ పనితీరుపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి ఎందుకు వస్తుందని ప్రశ్నించారు. మండలంలో 395 ఫిర్యాదులు అందాయని, ప్రతి ఫిర్యాదుపై క్షేత్రస్థాయిలో విచారణ జరిపి వాస్తవాలను నిర్ధారించి అర్హులకు న్యాయం చేయాలని ఆదేశించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వ అధికారులు జవాబుదారిగా వ్యవహరించాలన్నారు. వినతులపై అధికారులు స్పందించకపోయినా.. సమస్యలపై జాప్యం జరిగినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి పండుగ వాల్‌పోస్టర్లను విడుదల చేసి కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు.
● ఇదిలా ఉండగా.. మంత్రి మాట్లాడుతుండగా ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. బీసీ హాస్టల్‌కు సొంత భవనం, గురుకుల బాలికల హాస్టల్‌కు స్థలం కేటాయించాలని, పెండింగ్‌లో ఉన్న జెడ్పీహెచ్‌ఎస్, కేజీబీవీలను పూర్తిచేయాలని, అక్రమ డిప్యూటేషన్లపై వెళ్లిన టీచర్లను తిరిగి వెనక్కి రప్పించాలని విన్నవించారు.
పేదలకు ఆర్థిక భరోసా
కొల్లాపూర్ రూరల్: ఇందిరమ్మ ఇళ్ల పథకంతో నిరుపేదలకు ఆర్థిక భరోసా లభిస్తుందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. కొల్లాపూర్ మండలంలోని రామాపురంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఆయన భూమిపూజ చేసి పనులు ప్రారంభించి మాట్లాడారు. సొంత ఇల్లు ప్రతి పేద కుటుంబానికి ఒక కల అని, ఆ కలను నిజం చేసేందుకు ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఇళ్ల నిర్మాణాలు నాణ్యతగా, నిర్దేశిత గడువులోగా పూర్తయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకొని లబ్ధిదారులు తమ ఇళ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసుకోవాలని సూచించారు.


