రైతులకు రుణ ఊరట | - | Sakshi
Sakshi News home page

రైతులకు రుణ ఊరట

Nov 4 2026 1:56 AM | Updated on Nov 4 2026 1:56 AM

● రూ.1,778 కోట్ల రుణాల పునర్వ్యవస్థీకరణకు చర్యలు

● 12 నెలల మారటోరియం.. 60 నెలల వరకు చెల్లింపు గడువు

● అర్హులైన రైతులను గ్రామాల వారీగా గుర్తించాలి: కలెక్టర్‌

నాగర్‌కర్నూల్‌: కరువు, పంట నష్టాలతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులకు రుణ పునర్వ్యవస్థీకరణ ద్వారా ఊరట కల్పించాలని కలెక్టర్‌ హేమంత కేశవ్‌ పాటిల్‌ బ్యాంకు అధికారులను ఆదేశించారు. అర్హులైన రైతులకు 12 నెలల మారటోరియం కల్పించి.. కరువు తీవ్రతను బట్టి రుణ చెల్లింపు గడువును గరిష్టంగా 60 నెలల వరకు పొడిగించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మంగళవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రత్యేక జిల్లా సంప్రదింపుల కమిటీ (డీసీసీ) సమావేశంలో వ్యవసాయ రుణాల పునర్వ్యవస్థీకరణపై సమీక్షించారు. జిల్లాలో 65,893 మంది రైతులు రూ.1,125.10 కోట్ల పంట రుణాలు, మరో 27,297 మంది రూ.653.41 కోట్ల వ్యవసాయ కాలపరిమితి రుణాలు పొందినట్లు అధికారులు తెలిపారు. మొత్తం రూ.1,778.51 కోట్ల రుణాలకు సంబంధించి అర్హులైన రైతులను గుర్తించి నిబంధనల ప్రకారం ప్రయోజనాలు కల్పించాలని చెప్పారు. పంట నష్టం తీవ్రంగా ఉన్న 10 మండలాల్లో అర్హులైన రైతులకు 12 నెలల మారటోరియం కల్పించి, రుణాల తిరిగి చెల్లింపు వ్యవధిని గరిష్టంగా 60 నెలల వరకు పొడిగించేలా చర్యలు తీసుకోవాలన్నారు. పాక్షిక కరువు ప్రభావిత మండలాల్లో 12 నెలల మారటోరియంతోపాటు, నిబంధనల ప్రకారం చెల్లింపు గడువును గరిష్టంగా 36 నెలల వరకు పొడిగించాలన్నారు. తదుపరి పంట సాగుకు కొత్త రుణాలు సకాలంలో మంజూరు చేయాలని, రైతులపై బలవంతపు రుణ వసూళ్లకు పాల్పడరాదని స్పష్టం చేశారు. వ్యవసాయ శాఖ, బ్యాంకులు గ్రామాల వారీగా అర్హులైన రైతులను గుర్తించి, వారం రోజుల్లో అమలు పురోగతిపై నివేదిక ఇవ్వాలని పేర్కొన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు చెన్నయ్య, దేవసహాయం, లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌ చంద్రశేఖర్‌, ఆర్బీఐ, నాబార్డు ప్రతినిధులు, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement