● కూరగాయలు,పండ్ల తోటలకు ప్రోత్సాహకం
● రాయితీ అందిస్తున్న ప్రభుత్వం
తాడూరు: ఎల్‌నినో ప్రభావం వల్ల రైతులు సాగు చేసిన వివిధ రకాల పంటలకు ఆశించిన దిగుబడి లేకపోవడం.. మరోపక్క భూగర్భజలాలు తగ్గడంతో.. తక్కువ నీటితో అధిక విస్తీర్ణంలో సాగుచేయాలని ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీ వినియోగించుకోవాలని ఉద్యానవన శాఖ అధికారులు సూచిస్తున్నారు. ఉద్యాన పంటలకు ప్రభుత్వం మరింత ప్రోత్సహిస్తుంది. ప్రస్తుతం నెలకొన్న వర్షాభావ పరిస్థితుల వల్ల వరికి బదులుగా ఆకుకూరలు, కూరగాయలు, పండ్ల తోటలు సాగు చేసి ప్రత్యేక ప్రోత్సాహం అందుకోవాలని సూచించారు.
రాయితీ ఇలా..
కూరగాయలు సాగు చేసే రైతులకు ఎకరాకు రూ.9,600 ఆర్థిక సహాయం అందిస్తుంది. మల్చింగ్ విధానంలో పంటలు పండించే వారికి రూ.8 వేలు ఇవ్వనుంది. సూక్ష్మ సేద్య పరికరాలు డ్రిప్స్, స్ప్రింక్లర్ల కోసం ఎకరాకు రూ.90 వేలు సబ్సిడీ, కూరగాయల పందిరి నిర్మాణం కోసం అర ఎకరాకు రూ.75 వేలు, పాంపాండ్ నిర్మాణం ఒక యూనిట్‌కు రూ.90 వేలతోపాటు డ్రాగన్ ఫ్రూట్, అంజీరా, అవకాడో, మామిడి, పాపాయ సపోటా వంటి తోటలకు రాయితీ అందిస్తుంది. హైబ్రిడ్ కూరగాయల తోటల పెంపకంలో భాగంగా టమాట, మిరప, వంకాయ, క్యాబేజీ, క్యాలీఫ్లవర్ నారు అందుబాటులో ఉంది. ఆసక్తి గల రైతులు 30 నుంచి 40 రోజుల్లో తయారు చేసి అందిస్తామని అధికారులు చెప్పారు.
పూల తోటలు..
బంతి, చామంతి, కనకాంబరం, గులాబీ వంటి తోటలు ఎకరాకు రూ.38 వేల రాయితీ అందనుంది. ప్లాస్టిక్ మల్చింగ్ వేసినట్లయితే ఎకరాకు రూ.8 వేలు, ఉద్యాన యాంత్రీకరణలో మినీ ట్రాక్టర్, స్పేయర్ అందుబాటులో ఉన్నాయి. రాష్ట్రీయ కృషి యోజన పథకంలో కావాల్సిన రైతులకు డ్రిప్స్ సిస్టట్, స్ప్రింక్లర్లు, రెయిన్ గన్‌లు సబ్సిడీపై అందుబాటులో ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు.
రాయితీలు బాగున్నాయి..
ఎల్‌నినో ప్రభావంతో ఆశించిన మేర వాన లు పడలేదు. దీంతో భూగర్భ జలాలు గణనీయంగా తగ్గిపోతున్నాయి. ప్రభుత్వ సూచన మేరకు ఉద్యాన పంటల సాగుకు రైతులు ముందుకు రావాలి. ఇందుకోసం భారీస్థాయిలో రాయితీలు అందిస్తుంది.
– జగన్, ఉద్యాన శాఖ డివిజన్ అధికారి


