● జిల్లాలో సొంత భవనాలకు
నోచుకోని పంచాయతీలు
● చాలా వరకు అంగన్వాడీలు,
పాఠశాలల్లో నెట్టుకొస్తున్న వైనం
● సరిపడా వసతులు లేక
పాలకవర్గాల సతమతం
● రికార్డుల భద్రత, సమావేశాల
నిర్వహణకు అష్టకష్టాలు
● తాజాగా వీబీజీ రాంజీలో
వందకుపైగా భవనాలు మంజూరు
మా గ్రామ పంచాయతీ నూతన భవన నిర్మాణానికి 2023లో రూ.20 లక్షలు మంజూరయ్యాయి. కానీ, ఇంత వరకు పనులు పూర్తి కాలేదు. కాంట్రాక్టర్ నిధులు సరిపోవడం లేదని పనులు మధ్యలోనే వదిలేశారు. మెట్ల దగ్గర రూం, బండలు, కరెంటు, కలర్, ఇతర పనులు చేయాల్సి ఉంది. అదనంగా రూ.5 లక్షలు అవసరం పడుతున్నాయి. సొంత భవనం లేక రైతువేదికలో పంచాయతీ సమావేశాలు, నిర్వహణ కొనసాగుతుంది.
– లక్ష్మి, సర్పంచ్,
రాంనగర్, బల్మూర్ మండలం
జిల్లాలోని ప్రతి పంచాయతీకి సొంత భవనాలు ఉండేలా ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. కొత్తగా ఏర్పడిన పంచాయతీలతోపాటు పాత వాటన్నింటికీ సొంత భవనాలు నిర్మిస్తున్నాం. ప్రస్తుతం జిల్లాలో 104 గ్రామాలకు సొంత భవనాలు నిర్మించేందుకు నిధులు మంజూరయ్యా యి. గతంలో మంజూరైన కొన్ని భవనాలు ప్రారంభ దశలో ఉండగా.. మరికొన్ని స్లాబ్, ఇతర దశలో ఉన్నాయి. త్వరలోనే పంచాయతీ భవన నిర్మాణాలు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం.
– శ్రీరాములు,
జిల్లా పంచాయతీ అధికారి
అచ్చంపేట: పల్లెలే దేశానికి పట్టుగొమ్మలు. అలాంటి గ్రామ పంచాయతీలు ఇప్పటికీ సొంత భవనాలకు నోచుకోలేకపోతున్నాయి. జిల్లాలో మొత్తం 460 గ్రామాలు ఉండగా.. 167 పంచాయతీలకు సొంత భవనాలు లేవు. అలాగే సొంత భవనాలు ఉన్న 292లో చాలా వరకు శిథిలావస్థకు చేరుకున్నాయి. ఇందులో మరో 45 పంచాయతీలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. అయితే 2026– 27 ఏడాదిలో వీబీజీ రాంజీ పథకం కింద జిల్లాలో 104 గ్రామాలకు సొంత భవనాలు నిర్మించడానికి ఒక్కో భవనానికి రూ.20 లక్షల చొప్పున మొత్తం రూ.20.80 కోట్ల నిధులు మంజూరయ్యాయి.
మూడేళ్ల క్రితం మంజూరైనా..
జిల్లాలో 2023– 24, 2025– 26 సంవత్సరాల్లో ఎన్ఆర్ ఈజీఎస్, ఎస్డీఎఫ్ కింద 139 గ్రామాలకు కొత్త భవనాలు మంజూరయ్యాయి. ఇందులో 56 భవనాలు పూర్తి కాగా ఇందులో చాలా భవనాలు ఇప్పటికీ ప్రారంభోత్సవానికి నోచుకోలేదు. 78 భవనాలు ప్రారంభ దశలో ఉండగా.. మరికొన్ని స్లాబ్ లెవెల్లో ఉన్నాయి. బిజినేపల్లి మండలం అల్లీపూర్, కారుకొండ, అచ్చంపేట మండలం అక్కారం, పెంట్లవెల్లి మండలం జటప్రోల్, కోడేరు మండలం కోండ్రావుపల్లిలో స్థలాలు, ఇతర కారణాలతో ఇంత వరకు పనులు మొదలు పెట్టలేదు. ఎన్ఆర్ఈజీఎస్, ఎస్డీఎఫ్ పథకం ద్వారా పంచాయతీలకు రూ.20 లక్షల చొప్పున నిధులు మంజూరైనా సరిపోవడం లేదని పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు ముందకు రావడం లేదు. అలాగే చేసిన పనులకు సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో పనులు మధ్యలోనే వదిలేశారు.
ఎక్కడ పడితే అక్కడ..
జిల్లాలో పంచాయతీలకు సొంత భవనాలు లేక ప్రభుత్వ పాఠశాలలు, రైతువేదికలు, అంగన్వాడీ కేంద్రాలు, కుల సంఘాలు, కమ్యూనిటీ హాళ్లు, మరికొన్ని చోట్ల అద్దె భవనాల్లో నిర్వహిస్తున్నారు. పాఠశాలల ఆవరణలో ఉన్న పంచాయతీలకు పాఠశాల వేళలో వివిధ పనుల కోసం ప్రజలు వస్తుండటంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. అంగన్వాడీ కేంద్రాలకు గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పోషకాహారం పంచాల్సిన చోట పంచాయతీలు, రాజకీయ చర్చలు సాగుతుండటంతో గందరగోళంగా మారింది. ఇక సభలు, సమావేశాలు, అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించేందుకు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఈ క్రమంలో వీబీజీ రాంజీ పథకం కింద రూ.20 లక్షలతో భవన నిర్మాణాలు చేపట్టే అవకాశం ఉంది. అచ్చంపేట నియోజకవర్గంలోని 44 పంచాయతీలకు మంజూరైన ఎస్డీఎఫ్ను వీబీజీ రాంజీ పథకంలోకి మార్చడానికి ఎమ్మెల్యే వంశీకృష్ణ చొరవ తీసుకున్నారు.
సొంత కార్యాలయాలు లేనివి 167


