నాగర్కర్నూల్: జాతీయ ఆరోగ్య మిషన్లో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి అన్నారు. కలెక్టరేట్ వద్ద ఎన్హెచ్ఎం ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మె గురువారం మూడోరోజు కొనసాగింది. ఈ సందర్భంగా సమ్మె శిబిరాన్ని మాజీ ఎమ్మెల్యే సందర్శించి ఉద్యమానికి సంఘీభావం తెలిపి మాట్లాడారు. వైద్య, ఆరోగ్య సేవల్లో ఎన్హెచ్ఎం ఉద్యోగుల పాత్ర కీలకం అన్నారు. ఏళ్లుగా కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం గుర్తించి పరిష్కరించాలని కోరారు. అర్హులైన ఉద్యోగులను క్రమబద్ధీకరించడంతోపాటు ఉద్యోగ భద్రత కల్పించాలని, సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని, వేతనాల పెంపు, ఇతర సర్వీసు ప్రయోజనాలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని, ఉద్యోగులతో చర్చలు జరిపి సమస్యలను పరిష్కరించి, వారు తిరిగి విధుల్లో చేరేలా చర్యలు తీసుకోవాలని కోరారు.


