రెండో ఏఎన్‌ఎంల కష్టాలు తీరేదెన్నడో? | - | Sakshi
Sakshi News home page

రెండో ఏఎన్‌ఎంల కష్టాలు తీరేదెన్నడో?

Oct 13 2026 12:53 AM | Updated on Oct 13 2026 12:53 AM

● చాలీచాలని జీతాలతో ఇబ్బందులు

● ఏళ్లతరబడిగా క్రమబద్ధీకరణకు నోచుకోని వైనం

● జిల్లాలో 150 మంది విధుల నిర్వహణ

పనిభారంతో సతమతం..

జిల్లాలో పనిచేస్తున్న సెకండ్‌ ఏఎన్‌ఎంలు అదనపు పనిభారంతో మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. నిబంధనల ప్రకారం ప్రతి 5 వేల మంది జనాభాకు విధులు నిర్వహించారు. అయితే ప్రస్తుతం 13 నుంచి 15 వేల మంది జనాభాకు ఇద్దరు ఏఎన్‌ఎంలు మాత్రమే ఉండడంతో అదనంగా పనిభారం పడుతుంది. దీనికి తోడు ఆఫ్‌లైన్‌ రిపోర్టులు ఇవ్వడంతోపాటు వాటిని ఆన్‌లైన్‌ చేయడం, పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నేషనల్‌ ప్రోగ్రాంలు నిర్వహిస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. పదో తరగతి, ఇంటర్‌ పరీక్షల సమయంలో పరీక్ష కేంద్రాల వద్ద ప్రత్యేకంగా విధులు నిర్వహిస్తారు. గతంలో పాఠశాలలు, హాస్టల్‌ పిల్లలకు షెడ్యూల్‌ ప్రకారం వైద్య పరీక్షలు చేసేవారు. ఇప్పుడు అదనంగా అంగన్‌వాడీ పాఠశాలల చిన్నారులు, విద్యా ర్థులకు సైతం వైద్య పరీక్షలు చేస్తున్నారు. ఇలా అదనపు పనిభారంతో కొంతమంది అనారోగ్యాల బారిన పడుతున్న సంఘటనలు లేకపోలేదు.

కల్వకుర్తి రూరల్‌: వైద్య, ఆరోగ్య శాఖలో కీలకంగా పనిచేస్తున్న రెండో ఏఎన్‌ఎంలు అవస్థలు పడుతున్నారు. శ్రమ అధికం.. వేతనాలు తక్కువగా ఉండటంతో ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తమ కష్టాలను ప్రభుత్వం ఎప్పుడు తీర్చుతుందోనని ఆశగా ఎదురుచూస్తున్నారు. నేషనల్‌ హెల్త్‌ మిషన్‌–2009 సంవత్సరం నుంచి కాంట్రాక్ట్‌ పద్ధతిలో పనిచేస్తున్న సెకండ్‌ ఏఎన్‌ఎంలు పనిభారంతో ఒత్తిడికి గురవుతున్నారు. జీతాలు తక్కువైనా పని చేస్తూ కుటుంబ పోషణలో ఆర్థికంగా సతమతమవుతున్నారు. తమకు ఎలాంటి పరీక్షలు లేకుండా రెగ్యులరైజ్‌ చేయాలనే డిమాండ్‌తో గతంలో ఎన్నో ఉద్యమాలు చేసినా ఫలితం లేకుండాపోయింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ నుంచి తెలంగాణ రాష్ట్రం నూతన జిల్లాలు ఏర్పాటు అయినప్పటికీ కాంటాక్ట్‌ పద్ధతిన పనిచేస్తున్న సెకండ్‌ ఏఎన్‌ఎంల జీవితాల్లో వెలుగులు మాత్రం నిండటం లేదు.

జిల్లా పరిధిలో ఇలా..

జిల్లాలోని 32 పీహెచ్‌సీలలో 150 మంది రెండో ఏఎన్‌ఎంలు నెలకు రూ.27,300 వేతనంతో పనిచేస్తున్నారు. అనేక ఏళ్లుగా తక్కువ వేతనాలతో పనిచేస్తూ పేద ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్న తమకు న్యాయం దక్కడం లేదని వాపోతున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని కోరుతున్నారు. అలాగే అనేక ఏళ్లుగా చాలీచాలని వేతనాలతో పనిచేస్తున్న తమను క్రమబద్ధీకరించాలని సెకండ్‌ ఏఎన్‌ఎంలు వేడుకుంటున్నారు. ప్రభుత్వాలు, పాలకులు మారుతున్న తమ జీవితాలు మాత్రం మారడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌ పద్ధతిలో పనిచేస్తున్న ఏఎన్‌ఎంలందరినీ క్రమబద్ధీకరించాలని గతంలో అనేకమార్లు వివిధ రూపాల్లో ఆందోళనలు చేసి తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వాల దృష్టికి తీసుకుపోయినప్పటికీ ఫలితాలు కానరాలేదు. ప్రస్తుత ప్రజా ప్రభుత్వం తమ ఆవేదనను గుర్తించి తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని సెకండ్‌ ఏఎన్‌ఎంలు వేడుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement