కేఎల్‌ఐ నీరు మళ్లింపు | - | Sakshi
Sakshi News home page

కేఎల్‌ఐ నీరు మళ్లింపు

Oct 17 2026 8:00 AM | Updated on Oct 17 2026 8:00 AM

బల్మూర్‌: కేఎల్‌ఐ కాల్వ నీటి మళ్లింపుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. డిండి చెరువుకు నీటిని తరలించేందుకు కొత్తపల్లి వద్ద షట్టర్‌ తెరిచి.. గురువారం హిటాచీ యంత్రంతో గ్రామ రహదారి ధ్వంసం చేసి.. కాల్వ తవ్వారు. ఈ వ్యవహారంతో దిగువ ప్రాంతాల రైతులకు సాగునీటి కష్టాలు తప్పవనే ఆందోళన నెలకొంది. బల్మూరు మండలంలోని తుమ్మెన్‌పేట, ఉప్పునుంతల మండలంలోని లక్ష్మాపూర్‌ చెరువులను నింపాలనే పేరుతో నీటిని మళ్లిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఆ చెరువులు ఇప్పటికే నిండిపోయాయని స్థానికులు చెబుతున్నారు. నిండిన చెరువులకు మళ్లీ నీటిని తరలించడం వెనుక ఉద్దేశమేమిటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నిండిన చెరువుల ద్వారా పారే అలుగులతో దిగువనున్న డిండి చెరువుకు కేఎల్‌ఐ కాల్వ నీరు తరలించాలనే కుట్ర పన్నుతున్నారని రైతులు మండిపడుతున్నారు.

షెట్టర్‌ తెరిచింది ఆ రైతులే..

డిండి ప్రాంతానికి చెందిన కొంతమంది గురువారం రాత్రి హిటాచీ యంత్రంతో వచ్చి కొత్తపల్లి వద్ద కేఎల్‌ఐ కాల్వ షెట్టర్‌ కింది కాల్వ వెడల్పు చేసి తెరిచారని స్థానిక రైతులు తెలిపారు. దీనిపై అధికారులను నిలదీస్తే రెండు చెరువులను నింపడానికే షెట్టర్‌ కొంచెం తెరిచామని సాకులు చెబుతున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. షెట్టర్‌ ఒక్కసారిగా ఓపెన్‌ చేయడంతో నీటి తాకిడికి కొత్తపల్లి గ్రామానికి వెళ్లే రహదారి ద్వంసమైందని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికితోడు ఇదిలాగే కొనసాగితే బల్మూరు, ఉప్పునుంతల, అచ్చంపేట, వంగూరు తదితర దిగువ ప్రాంతాల రైతులకు సాగునీరు అందకపోతే పంటలు ఎండిపోయే ప్రమాదం ఉంది. ఒకవైపు సాగునీటి కోసం రైతులు ఎదురుచూస్తుంటే.. మరోవైపు నీటిని ఇతర ప్రాంతాలకు మళ్లిస్తున్నారనే ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.

ఆ చెరువులు నిండాయి..

మా గ్రామ సమీపంలోని కేఎల్‌ఐ కాల్వ వద్ద గురువారం డిండి ప్రాంతానికి చెందిన కొంతమంది వచ్చి హిటాచీతో కాల్వ వెడల్పు చేయడమే కాకుండా షెట్టర్‌ ఓపెన్‌ చేశారు. నెల రోజుల క్రితమే లీకేజీ నీటితోనే తుమ్మెన్‌పేట చెరువు నిండి అలుగు పారుతుంది. లక్ష్మాపూర్‌ చెరువు కూడా నిండింది. వీటిని ఇప్పుడు నింపాల్సిన అవసరమే లేదు. షెట్టర్‌ ఒక్కసారిగా తెరవడంతో గ్రామ రహదారి ధ్వంసమై పొలాలకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. అధికారులను నిలదీస్తే సాకులు చెబుతున్నారు.

– వెంకటయ్య, రైతు, కొత్తపల్లి గ్రామం

షెట్టర్‌ బంద్‌ చేస్తాం..

తుమ్మెన్‌పేట, లక్ష్మాపూర్‌ చెరువులను నింపడం కోసమే కొత్తపల్లి వద్ద షెట్టర్‌ ఓపెన్‌ చేశాం. షెట్టర్‌ తెరవడానికి ఎవరికి అనుమతి ఇవ్వలేదు. ఇక్కడి రైతులకే నీరు సరిపోదు కాబట్టి డిండికి నీళ్లు ఎందుకు వదులుతాం. రైతులు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదు.

– అమర్‌సింగ్‌, ఈఈ, నీటిపారుదల శాఖ

కొత్తపల్లి వద్ద షెట్టర్‌ ఓపెన్‌ చేసి డిండి చెరువుకు అక్రమంగా తరలింపు

ఇప్పటికే నిండిన తుమ్మెన్‌పేట, లక్ష్మాపూర్‌ చెరువులకు మళ్లీ నీరెందుకో?

గ్రామ రహదారి ధ్వంసంతో రాకపోకలకు ఆటంకం

కొరవడిన నీటిపారుదల శాఖఅధికారుల పర్యవేక్షణ

చివరి ఆయకట్టుకు సాగునీరు అందదని రైతుల ఆందోళన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement