మారిన జీవనశైలి..
ఉరుకులు, పరుగుల జీవితం, సమయానికి ఆహారం తీసుకోకపోవడం, పాస్ట్‌ఫుడ్, అధిక చక్కెర కలిగిన పానియాలు తీసుకోవడం, నిద్రలేమి వంటివి ఆరోగ్య సమస్యలకు దారితీస్తున్నాయి. గంటల తరబడి కూర్చొని పనిచేయడం, వ్యాయామానికి సమయం కేటాయించకపోవడం వల్ల శరీరంలో కొవ్వు పెరిగి మధుమేహం, అధిక రక్తపోటు వచ్చే ప్రమాదం పెరుగుతోంది. కుటుంబ చరిత్రలో ఈ వ్యాధులు ఉండటం కూడా ముప్పును పెంచుతుంది.
లక్షణాలు కనిపించకుండానే
బీపీ, షుగర్ వ్యాధులు ప్రారంభ దశలో స్పష్టమైన లక్షణాలు చూపకపోవచ్చు. అందువల్ల చాలామంది తమకు వ్యాధి ఉన్న విషయాన్ని గుర్తించలేకపోతున్నారు. సాధారణ ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నప్పుడు అనుకోకుండా బయటపడుతున్న సందర్భాలూ ఉన్నాయి. తరచూ దాహం వేయడం, మూత్ర విసర్జన పెరగడం, అలసట వంటి లక్షణాలు మధుమేహంలో కనిపించవచ్చు. అయితే లక్షణాలు లేకపోయినా వ్యాధి ఉండే అవకాశం ఉంది. అందుకే వయసు, కుటుంబ చరిత్ర, ఇతర ఆరోగ్య ప్రమాదాలను బట్టి వైద్యుల సూచన మేరకు పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
చిన్న వయసులోనే..
30 ఏళ్లకే బీపీ, షుగర్ వస్తే వాటిని నిర్లక్ష్యం చేయడం భవిష్యత్‌లో తీవ్ర సమస్యలకు దారితీయవచ్చు. నియంత్రణలో లేని మధుమేహం, అధిక రక్తపోటు గుండె జబ్బులు, మూత్రపిండాల సమస్యలు, చూపు దెబ్బతినడం, పక్షవాతం వంటి సమస్యల ప్రమాదాన్ని పెంచుతాయి. చిన్న వయసులోనే వ్యాధులు నిర్ధారణ కావడంతో దీర్ఘకాలం పాటు ఆరోగ్యంపై శ్రద్ధ చూపాల్సిన అవసరం ఏర్పడుతుంది.
కందనూలు: ఒకప్పుడు 50 ఏళ్లు దాటిన వారిలో ఎక్కువగా కనిపించే అధిక రక్తపోటు (బీపీ), మధుమేహం (షుగర్) వంటి వ్యాధులు ప్రస్తుత కాలంలో 30 ఏళ్లకే పలకరిస్తున్నాయి. జిల్లాలో వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నాన్ కమ్యూనికేబుల్ డీసీజెస్ (ఎన్‌సీడీ) సర్వేలో బీపీ, షుగర్ బారిన పడినవారు బయటపడుతున్నారు. మారుతున్న జీవనశైలి, శారీరక శ్రమ తగ్గడం, ఆహారపు అలవాట్లలో మార్పులు, మానసిక ఒత్తిడి వంటి అంశాలు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఫలితంగా చిన్న వయసులోనే బీపీ, షుగర్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.
ముందస్తు పరీక్షలు
బీపీ, షుగర్‌ను ముందుగానే గుర్తిస్తే సరైన చికిత్స, జీవనశైలిలో మార్పులతో వాటిని నియంత్రణలో ఉంచుకోవచ్చు. బీపీ, షుగర్ వ్యాధులు ప్రారంభ దశలో స్పష్టమైన లక్షణాలు కనిపించకుండానే ఉండే అవకాశం ఉంది. దీంతో చాలామంది తమకు వ్యాధి ఉన్న విషయాన్ని గుర్తించలేకపోతున్నారు. సొంత వైద్యం, అపోహలకు దూరంగా ఉండాలి. యువత ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలి.
సర్వేలో వ్యాధుల గుర్తింపు..
వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో నిర్వహిస్తున్న ఎన్‌సీడీ సర్వేలో మధుమేహం, రక్తపోటు వంటి దీర్ఘకాలిక వ్యాధుల బారిన ఎంతమంది పడుతున్నారో తెలుసుకుంటున్నారు. జాతీయ ఆరోగ్య మిషన్ పథకంలో భాగంగా అన్ని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, పట్టణ ఆరోగ్య కేంద్రాలు, జిల్లా ఆస్పత్రులు.. ఇలా అన్నింటిలోనూ బీపీ, షుగర్ పరీక్షలు చేస్తున్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లాలో 9,18,917 మంది జనాభా ఉండగా.. 30 ఏళ్ల పైబడిన వారు 4,84,885 మంది ఉన్నట్లు గుర్తించారు. ఇప్పటి వరకు 3,63,919 మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా.. మధుమేహం ఉన్నవారు 37,842 మంది, రక్తపోటు (బీపీ) ఉన్నవారు 64,880 మంది ఉన్నట్లు గుర్తించి, వారికి వైద్యంతోపాటు అవసరమైన మందులు అందిస్తున్నారు. వారి వివరాలను వెబ్ పోర్టల్‌లో నమోదు చేసి ఎన్‌సీడీ కార్డు ఇస్తున్నారు.
జిల్లాను పీడిస్తున్న దీర్ఘకాలిక వ్యాధులు
ఆరోగ్యంపై నిర్లక్ష్యమే ప్రధాన కారణం
మారుతున్న ఆహారపు అలవాట్లతో తీవ్ర ముప్పు
వైద్య పరీక్షల్లో వెలుగు చూస్తున్న వాస్తవాలు
జిల్లాలో కొనసాగుతున్న ఎన్‌సీడీ సర్వే


