ఆరుతడి పంటల సాగుకు ప్రోత్సాహం | - | Sakshi
Sakshi News home page

ఆరుతడి పంటల సాగుకు ప్రోత్సాహం

Oct 10 2026 1:16 AM | Updated on Oct 10 2026 1:16 AM

కందనూలు: జిల్లాలో రానున్న రబీ సీజన్‌లో ఆరుతడి పంటల సాగు చేసేలా రైతులకు ప్రోత్సహిస్తున్నామని కలెక్టర్‌ హేమంత కేశవ్‌ పాటిల్‌ అన్నారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు, వ్యవసాయం, భూగర్భ జలాలు, తాగునీటి వసతి, ఇంకుడు గుంతల నిర్మాణం, పంచాయతీరాజ్‌ శాఖ పనితీరు, ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనపై సీఎస్‌ సంజయ్‌జాజు శుక్రవారం హైదరాబాద్‌ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీసీ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో వ్యవసాయ పరిస్థితులను కలెక్టర్‌ వివరించారు. గత వానాకాలం సీజన్‌లో జిల్లాలో సుమారు 4.87 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేయగా, ప్రస్తుతం సాగు విస్తీర్ణం 1.41 లక్షల ఎకరాలకు తగ్గిందని వెల్లడించారు. ముఖ్యంగా పత్తితోపాటు వరి సాగుపైనా ప్రభావం పడినట్లు చెప్పారు. రానున్న రబీ సీజన్‌లో అందుబాటులో ఉన్న నీటి వనరులు, సాగుకు అనుకూలమైన పరిస్థితులను పరిగణలోకి తీసుకుని రైతులకు తగిన సూచనలు అందించడంతోపాటు ఆరుతడి పంటల సాగుపై దృష్టి సారించనున్నట్లు వివరించారు. అనంతరం జిల్లా అధికారులతో కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో కరువు మండలాలను గుర్తించేందుకు చర్యలు తీసుకోవాలని, నీటిపారుదలకు సంబంధించిన గ్రామసభలు నిర్వహించి మాత్రమే సాగునీటిని విడుదల చేయాలని చెప్పారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు చెన్నయ్య, దేవసహాయం, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement