కందనూలు: సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సంగ్రామ్ సింగ్‌జీ పాటిల్ అన్నారు. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో అక్టోబర్ నెలను సైబర్ అవేర్నెస్ (అవగాహన) మాసంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో సైబర్ క్రైం అవగాహన వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ డిజిటల్ యుగంలో రోజురోజుకూ పెరుగుతున్న సైబర్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రతిఒక్కరూ ఆగండి.. ఆలోచించండి.. అడుగు వేయండి.. అనే మూడంచెల విధానం పాటించాలని సూచించారు. ఇంటి వద్ద నుంచే సులభంగా డబ్బు సంపాదించవచ్చని, రేటింగ్స్ ఇస్తే పార్ట్ టైం ఉద్యోగాలు ఇస్తామని చెప్పి పంపే వ్యాట్సాప్, టెలిగ్రాం మెసేజ్‌లను నమ్మవద్దని, తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు ఇస్తామని చెప్పే నకిలీ ట్రేడింగ్ యాప్‌లు, క్రిప్టో కరెన్సీ స్కీంల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే లింకులను క్లిక్ చేయవద్దని, బ్యాంక్, వ్యక్తిగత వివరాలను ఎవరితోనూ పంచుకోవద్దని పేర్కొన్నారు. ఒకవేళ సైబర్ మోసానికి గురైతే వెంటనే ఉచిత హెల్ప్‌లైన్ నంబర్ 1930కి ఫిర్యాదు చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఏఎస్పీ వెంకటేశ్వర్లు, సైబర్ క్రైం ఎస్‌ఐ గిరిమనోహర్‌రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ ఎస్‌ఐ శ్రీనివాస్, జిల్లా సైబర్ క్రైం టీం సభ్యులు తేజశ్రీ, రవికుమార్ పాల్గొన్నారు.


