మన్ననూర్: అమ్రాబాద్ పులుల రక్షిత అభయారణ్యంలోని గుండం సమీపంలో జంగిల్ సఫారీలో పర్యటిస్తున్న పర్యాటకులకు శుక్రవారం పెద్దపులి కనిపించింది. ఈ నెల 1న జంగిల్ సఫారీ పునఃప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మరుసటి రోజు నుంచి తరుచుగా ప్రయాణికులు, పర్యాటకులకు పెద్దపులి కనిపిస్తుండటంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అభయారణ్యంలో వన్యప్రాణులతోపాటు పెద్దపులుల సంఖ్య గణనీయంగా పెరగడమే ఇందుకు కారణమని పలువురు చర్చించుకుంటున్నారు.
నల్లమలలో శిక్షణ అధికారులు
హైదరాబాద్ దూలపల్లి అటవీ శాఖలో శిక్షణ పొందుతున్న ఎఫ్‌ఎస్‌ఓలు, బీట్ ఆఫీసర్లు శుక్రవారం నల్లమల, అమ్రాబాద్ పులుల రక్షిత అభయారణ్యంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఎఫ్‌డీఓ చంద్ర ప్రకాష్ సింఘాల్ సమక్షంలో మన్ననూర్‌లోని ఈసీ సెంటర్‌ను పరిశీలించిన అనతరం సఫారీ వాహనాల్లో ఫర్హాబాద్, వ్యూ పాయింట్లను సందర్శించారు. ఈ క్రమంలో ఇక్కడి పరిస్థితులు, అడవులు, వన్యప్రాణుల మనుగడ, ప్రకృతి ప్రేమికుల కోసం ఏర్పాటు చేసిన జంగిల్ సఫారీ తదితర వాటి గురించి శిక్షణ అధికారులకు వివరించారు.


