కందనూలు: పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు కృషి చేస్తున్న కార్మికుల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత తమపై ఉందని మున్సిపల్ చైర్మన్ తీగల సునేంద్రకుమార్ అన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమంలో భాగంగా బుధవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికులు, సిబ్బందికి వైద్యశిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ.. మున్సిపాలిటీని స్వచ్ఛంగా ఉంచేందుకు పారిశుద్ధ్య కార్మికులు నిరంతరం శ్రమిస్తున్నారన్నారు. ఈ క్రమంలో కార్మికులు ఆరోగ్య సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. అనంతరం వైద్యసిబ్బంది కార్మికులకు పలు పరీక్షలు నిర్వహించి.. అవసరమైన మందులను అందజేశారు. మున్సిపల్ కమిషనర్ నాగిరెడ్డి, వైస్‌చైర్మన్ బాదం రమేశ్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.


