మనుగడకే ముప్పు..? | - | Sakshi
Sakshi News home page

మనుగడకే ముప్పు..?

Sep 30 2026 1:10 AM | Updated on Sep 30 2026 1:10 AM

ఆదాయం కోల్పోతే డిపోపై ప్రభావం

ఆర్టీసీ డిపోలో పనిచేస్తున్న కార్మికులకు వేధింపులు తప్పడం లేదని ఆందోళన చేస్తున్నారు. తమకు యూనియన్‌ గుర్తింపు లేకపోవడంతో అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మహిళలు అనే కనికరం చూపకుండా రాత్రివేళ డ్యూటీలు వేస్తూ వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు తెలుస్తోంది. చిన్న విషయాన్ని పెద్దగా రాద్ధాంతం చేస్తూ చర్యలు తీసుకుంటున్నట్లు కొందరు కార్మి కులు ఆవేదన వ్యక్తం చేశారు. గత పదేళ్లుగా ఉన్న రూట్లను రద్దు చేసుకొని ఇతర డిపోలకు వాటిని అప్పగిస్తే కల్వకుర్తి డిపో పరిస్థితి ప్రశ్నార్థకంగా మారుతుంది. రూట్లు లేకుండా ఆదాయం కోల్పోతే డిపో ఎందుకు అనే ప్రశ్న తలెత్తుతుంది. వెంటనే ప్రజాప్రతినిధులు కల్పించుకొని కల్వకుర్తి డిపోను బలోపేతం చేసి ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని కార్మికులు కోరుతున్నారు.

కల్వకుర్తి రూరల్‌: ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోనే పోరాటాల ద్వారా సాధించిన డిపోగా కల్వకుర్తికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇందుకు అనుగుణంగానే మూడు దశాబ్దాలుగా కల్వకుర్తి డిపో అంచెలంచెలుగా ఎదిగింది. ఇటీవల రాఖీ పౌర్ణమి పండుగ సందర్భంగా రాష్ట్రస్థాయిలో కలెక్షన్లలో అగ్రభాగాన నిలిచింది. అయితే సంబంధిత అధికారుల వ్యవహార శైలి, తీరుతో డిపో మనుగడ ప్రశ్నార్థకంగా మారే పరిస్థితులు నెలకొంటున్నాయి. కార్మికులపై వేధింపులు, బస్సు వేళలలో మార్పులు, కొన్ని బస్సులు ఇతర డిపోలకు కేటాయింపు తదితర విషయాలతో కల్వకుర్తి డిపోలోని కార్మికులు కలత చెందుతున్నారు. యాజమాన్యం అనుసరిస్తున్న నిరంకుశ వైఖరితో రోజురోజుకూ సమస్య జటిలంగా మారుతుందని ఆందోళన కార్మికులలో ఆందోళన వ్యక్తమవుతోంది. డిపో మనుగడకు ఇబ్బందిగా ఉన్న సమయంలో.. 10 సంవత్సరాల క్రితం కార్మికులు అప్పటి యాజమాన్యం విశేషంగా కష్టపడి సాధించిన రూట్లను ప్రస్తుత యాజమాన్యం వదిలేసే ప్రక్రియకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు సమాచారం.

సర్వీస్‌ల నిలిపివేత..

కల్వకుర్తి డిపో ఆదాయం పడిపోతుండడంతో డిపోను ఎత్తివేసేందుకు యాజమాన్యం సిద్ధమైంది. అప్పటి పరిస్థితులలో డిపో మేనేజర్‌గా వ్యవహరించిన వసురాం నాయక్‌ కార్మికులతో చర్చించి ఆర్డినరీ బస్సులను ఎక్స్‌ప్రెస్‌గా మార్చి.. జిల్లాలోని లింగాల, వట్టిపల్లి, తెలకపల్లి, యాపట్ల, తెలకపల్లి– లింగాల రూట్‌లో ఉన్న గ్రామాలను కలుపుతూ వెళ్లే విధంగా డే అవుట్‌, నైట్‌ అవుట్‌ బస్సులను నడిపించారు. దీంతో బస్సులలో ప్రయాణికుల రద్దీ పెరగడంతోపాటు డిపోకు ఆ రూట్లలో భారీగా ఆదాయం పెరిగింది. దీంతో కార్మికులు తమ కష్టం ఫలించిందని సంతోషించారు.

9 కొత్త బస్సులు వెనక్కి..

ప్రభుత్వం కల్వకుర్తి డిపోకు కొత్తగా 9 బస్సులను మంజూరు చేసినట్లు కార్మికులు తెలిపారు. అయితే యాజమాన్యం పంపిన కొత్త బస్సుల స్థానంలో 10 పాత బస్సులు డిపోకు రావడంపై వారు ఆందోళన వ్యక్తం చేశారు. కల్వకుర్తికి రావాల్సిన నూతన బస్సులు షాద్‌నగర్‌, కొల్లాపూర్‌, కోస్గి, మహబూబ్‌నగర్‌ తదితర డిపోలకు వెళ్లినట్లు సమాచారం. గతంలోనూ నూతన బస్సులు ఇతర డిపోలకు వెళ్తున్న విషయాన్ని కొందరు కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి దృష్టికి తేవడంతో ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేసి బస్సులను తిరిగి కల్వకుర్తికి వచ్చేలా చేశారు. ప్రస్తుతం యాజమాన్యం సైతం మరోసారి కొత్తగా వచ్చే బస్సులను ఇతర డిపోలకు పంపడం చర్చనీయాంశంగా మారింది.

ప్రశ్నార్థకంగా మారుతున్న కల్వకుర్తి డిపో నిర్వహణ

పదేళ్ల క్రితం నాటి సర్వీసుల నిలిపివేతకు చర్యలు

పది కొత్త బస్సులు ఇతర డిపోలకు మళ్లింపు

మరోవైపు కార్మికులకు తప్పని వేధింపులు

ప్రస్తుత అధికారుల తీరుతో జటిలమవుతున్న సమస్య

కొత్త బస్సులు రాలేదు..

కల్వకుర్తి డిపోకు కొత్తగా బస్సులు రాలేదు. అలాగే లింగాల రూట్‌లో బస్సులు నిలిపివేసే ఆలోచన కూడా లేదు. కార్మికుల విషయంలోనూ నిబంధనల ప్రకారం వ్యవహరిస్తున్నాం. వేధింపులకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు అవాస్తవం. – షాలిని, డీఎం, కల్వకుర్తి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement