కల్వకుర్తి రూరల్: క్రీడాకారులు క్రమశిక్షణతో సాధన చేసి పట్టుదలతో నిరంతరం ప్రయత్నిస్తే ప్రతి క్రీడాకారుడు అంతర్జాతీయ స్థాయికి చేరుకునే అవకాశం ఉంటుందని జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి స్వాములు అన్నారు. అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో 20 నేషనల్ ఇంటర్ డిస్టిక్ జూనియర్ అథ్లెటిక్స్‌కు జిల్లా క్రీడాకారులను ఎంపిక చేసే ప్రక్రియ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో మంగళవారం నిర్వహించారు. ఈ పోటీలలో సత్తాచాటిన క్రీడాకారులు 12వ రాష్ట్ర సబ్ జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్–2026 అక్టోబర్ 11న కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో జరిగే పోటీలలో పాల్గొననున్నట్లు స్వాములు వెల్లడించారు. పోటీలకు మొత్తం 500 మంది క్రీడాకారులు హాజరు కాగా.. అండర్–10, 12, 14 బాలబాలికల విభాగాల్లో క్రీడాకారులను ఎంపిక చేశారు. మహబూబ్‌నగర్ జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శరత్‌చంద్ర పర్యవేక్షణలో ఎంపిక ప్రక్రియ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను పరిశీలించిన నివేదికను అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు సమర్పిస్తానన్నారు. కార్యక్రమంలో ఫిజికల్ డైరెక్టర్ షంషీర్ అలీ, రాజేందర్, మల్లేష్, జయలక్ష్మి, జ్యోతి, స్మిత పాల్గొన్నారు.


