కందనూలు: మీడియేషన్ (మధ్య వర్తిత్వం) ద్వారా కేసులు త్వరగా పరిష్కారం లభిస్తుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి రమాకాంత్ అన్నారు. మంగళవారం జిల్లా కోర్టులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కోర్టులో సివిల్, బ్యాంకింగ్, ఫైనాన్షియల్, మ్యాట్రిమోని తదితర కేసులను సుదీర్ఘంగా కొనసాగించకుండా, ఇరుపక్షాల మధ్య చర్చల ద్వారా వివాదాన్ని పరిష్కరించుకోవచ్చని, ఇందులో ప్రభుత్వం న్యాయవాది మధ్యవర్తిత్వం వహించి ఇరుపక్షాల మాటలను విని, పరస్పర అంగీకారంతో కేసులకు పరిష్కారం చూపిస్తుందన్నారు. దీని ద్వారా కోర్టు సమయం, కక్షిదారుల ఖర్చులు తగ్గుతాయని, ఇరుపక్షాల మధ్య స్నేహపూర్వక వాతావరణం కొనసాగుతుందని అభిప్రాయపడ్డారు. అంగీకారం కుదిరినప్పుడు, చట్టపరమైన ప్రక్రియ ద్వారా కేసులను పరిష్కరించుకొని త్వరగా న్యాయం పొందవచ్చన్నారు. అనంతరం మీడియేషన్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. సమావేశంలో స్పెషల్ సెషన్స్ జడ్జి నసీమా సుల్తానా, జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రెటరి నిహారిక తదితరులు పాల్గొన్నారు.


