ధరణి దరిద్రాన్ని దూరం చేసేందుకే రీ సర్వే
పరిష్కార మార్గాలు చూపాలి
కలెక్టర్లు బాధ్యత తీసుకోవాలి: యెన్నం
● భూ సమస్యలకు శాశ్వత పరిష్కారమే లక్ష్యం
● నవంబర్ 15లోగా రీ సర్వే పూర్తి చేయాలి
● అలసత్వం ప్రదర్శించే అధికారులపై చర్యలు
● రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణశాఖ
మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
వనపర్తి: గత పాలకులు తీసుకొచ్చిన ధరణి దరిద్రాన్ని దూరం చేసేందుకే సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం భూముల రీ సర్వేకు శ్రీకారం చుట్టిందని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు.రీసర్వేను అధికారులు అత్యంత ప్రాధాన్యతతో, పూర్తి బాధ్యతతో నిర్వహించాలని ఆదేశించారు. ముందుగా గ్రామాల సరిహద్దులను పక్కాగా నిర్ధారించుకుని, ఆ తర్వాత భూముల సర్వేను పక్కాగా చేపట్టాలన్నారు. సోమవారం వనపర్తి ఐడీఓసీ సమావేశ మందిరంలో రెవెన్యూ, గృహనిర్మాణం, భూముల రీసర్వే అంశాలపై నిర్వహించిన ఉమ్మడి జిల్లాస్థాయి సమావేశానికి రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యేలతో కలిసి ఆయన హాజరై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మండలాల వారీగా భూముల రీసర్వే ప్రక్రియ పురోగతిపై తహసీల్దార్లు, సర్వేయర్లతో ఆరా తీశారు. అలాగే రైతుల నుంచి వ్యక్తమవుతున్న అనుభవాలను అడిగి తెలుసుకున్నారు. ఉమ్మడి జిల్లాస్థాయి సమీక్ష అనంతరం మంత్రి పొంగులేటి విలేకర్లతో మాట్లాడారు. సుమారు 120 ఏళ్ల క్రితం భూముల సర్వే నిర్వహించారని.. మళ్లీ ఇప్పుడు భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం కల్పించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర రీసర్వే ప్రక్రియను చేపట్టిందన్నారు. తహసీల్దార్ స్థాయి నుంచి కలెక్టర్ వరకు అధికారులందరూ క్షేత్రస్థాయికి వెళ్లి ఈ ప్రక్రియను తప్పనిసరిగా పర్యవేక్షించాలన్నారు. నవంబర్ 15వ తేదీలోగా ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. సర్వే విషయంలో అటవీ, రెవెన్యూశాఖలు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. రీసర్వే ప్రక్రియకు సంబంధించి రైతులకు ఎప్పటికప్పుడు సమగ్ర సమాచారాన్ని అందిస్తూ.. ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలన్నారు. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించినా, అవినీతికి పాల్పడినా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. కాగా, కొన్ని ప్రాంతాల్లో ఆశించిన స్థాయిలో ముందుకు సాగకపోవడంపై మంత్రి అసంతృప్తిని వ్యక్తం చేశారు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని మంత్రి పొంగులేటి అన్నారు. మొదటి విడతలో ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లు కేటాయించగా.. రెండో విడతలో మరో 2వేల ఇళ్లను కేటాయిస్తున్నట్లు తెలిపారు. తొలి దశలో చేసిన తప్పులు రెండో దశలో పునరావృతం కానివ్వొద్దని అధికారులకు సూచించారు. మూడు, నాలుగో విడతల్లోనూ ఇందిరమ్మ ఇళ్ల మంజూరు ఉంటుందన్నారు. రాష్ట్రంలోని ఏ జనావాస ప్రాంతంలో పూరిగుడిసె ఉండనియ్యమన్నారు.
మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. ప్రజల నుంచి వచ్చే అర్జీలను అధికారులు క్రమబద్ధమైన విధానంలో పరిశీలించి, పరిష్కార మార్గాలు చూపాలన్నారు. ప్రతి నెలలో ఒక్కో మండలానికి ఒక రోజు కేటాయించి, ఆ మండలానికి సంబంధించిన ప్రజా సమస్యలపై సమీక్షించాలన్నారు. అక్కడికక్కడే సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అర్జీల స్వీకరణ కోసం ప్రత్యేక వాట్సాప్ నంబర్ ఏర్పాటుచేసి ప్రజలకు తెలియజేయాలన్నారు. ప్రజల నుంచి వచ్చిన అర్జీలు వారం రోజులకు మించి పెండింగ్‌లో ఉండకూడదన్నారు. మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ.. మక్తల్ నియోజకవర్గంలో ప్రతిపాదిత పవర్ ప్లాంట్‌కు సంబంధించిన భూ సమస్యను పరిష్కరించే దిశగా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.
ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యం వహించకుండా బాధ్యతగా పనిచేయాలని ప్రభుత్వ విప్, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. కలెక్టర్ నుంచి క్షేత్రస్థాయి సిబ్బంది వరకు ప్రజలకు అందుబాటులో ఉండాలని.. అభివృద్ధి కార్యక్రమాల అమలుపై కలెక్టర్లు పూర్తి బాధ్యత తీసుకోవాలని కోరారు. సమావేశంలో కలెక్టర్లు ఖుష్బూగుప్తా, ఆదర్శ్ సురభి, రిజ్వాన్ బాషా షేక్, హేమంత కేశవ్ పాటిల్, సీహెచ్ ప్రియాంక, కార్పొరేషన్ చైర్మన్ సరిత, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి లోకేష్ కుమార్, రిజిస్ట్రేషన్లు, స్టాంప్స్ ప్రత్యేక కార్యదర్శి రాజీవ్ హనుమంతు, గృహనిర్మాణశాఖ ఎండీ గౌతమ్, ఎమ్మెల్యేలు మేఘారెడ్డి, మధుసూదన్‌రెడ్డి, అనిరుధ్‌రెడ్డి, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, చిక్కుడు వంశీకృష్ణ, కూచుకుళ్ల రాజేశ్‌రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి ఉన్నారు.


