కందనూలు: పదోన్నతి బాధ్యతలను మరింత పెంచుతుందని ఎస్పీ సంగ్రామ్ సింగ్‌జీ పాటిల్ అన్నారు. వెల్దండ ఏఎస్‌ఐ శ్రీనివాసులు, వంగూరు ఏఎస్‌ఐ ఇబ్రహిం, కొల్లాపూర్ ఏఎస్‌ఐ రామస్వామిగౌడ్ ఇటీవలే ఎస్‌ఐగా పదోన్నతి పొందారు. ఈ మేరకు సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ వారికి అభినందనలు తెలిపి.. ఎస్‌ఐ హోదాకు సంబంధించిన స్టార్స్ అందించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ పదోన్నతి పొందిన ప్రతి పోలీస్ తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ.. ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని సూచించారు.
పోలీస్ గ్రీవెన్స్‌కు 8 అర్జీలు
కందనూలు: ప్రజలు నిర్భయంగా.. మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా.. నేరుగా తమ సమస్యలపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఎస్పీ సంగ్రామ్ సింగ్‌జీ పాటిల్ అన్నారు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ సెల్‌లో బాధితుల నుంచి ఎస్పీ 8 ఫిర్యాదులు స్వీకరించారు. ఇందులో 4 భూమి, 3 భార్యాభర్తల గొడవ, 1 తగు న్యాయం చేయాలని ఫిర్యాదు వచ్చాయని, ఆయా ఫిర్యాదుల పరిష్కారం కోసం సంబంధిత స్టేషన్లకు పంపినట్లు చెప్పారు.
ఐదు గ్రామాలకు
నిధులు విడుదల
అమ్రాబాద్: జిల్లాలో సర్పంచ్‌లు, వార్డు సభ్యులు లేని 5 గ్రామాలకు ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు మంజూరు చేసింది. అమ్రాబాద్ మండలంలోని ఐదు గ్రామ పంచాయతీలు కుమ్మరోనిపల్లికి రూ.4.20 లక్షలు, ఒంగురోనిపల్లికి రూ.3.37 లక్షలు, లక్ష్మాపూర్(బీకే)కు రూ.2.89 లక్షలు, కల్ములోనిపల్లికి రూ.2.15 లక్షలు, ప్రశాంత్‌నగర్‌కాలనీకి రూ.2.17 లక్షలు మంజూరయ్యాయని ఎంపీడీఓ రామన్న సోమవారం విలేకరులకు తెలిపారు. ఏజెన్సీ ప్రాంతమైన అమ్రాబాద్ మండలంలో మొత్తం 20 గ్రామ పంచాయతీలు ఉండగా గిరిజనులు లేని కుమ్మరోనిపల్లి, ఒంగురోనిపల్లి, లక్ష్మాపూర్(బీకే), కల్ములోనిపల్లి, ప్రశాంత్‌నగర్‌కాలనీ గ్రామాల్లో రిజర్వేషన్ కారణంగా స్థానిక ఎన్నికలు జరగలేదు. దీంతో ఇప్పటి వరకు ఎలాంటి నిధులు రాక ఇన్నాళ్లు గ్రామాల్లో పారిశుద్ధ్యం, నీరు కనీస సమస్యల పరిష్కారానికి అవస్థలు పడ్డ గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం ప్రత్యేక చొరవతో నిధులు మంజూరు చేసిందని చెప్పారు. ఈ నిధులు ఏడాది వరకు మంచినీరు, పారిశుద్ధ్య పనులకు వినియోగించాల్సి ఉందని పేర్కొన్నారు.


