ఆయిల్‌పాంపై ఆసక్తి | - | Sakshi
Sakshi News home page

ఆయిల్‌పాంపై ఆసక్తి

Sep 18 2026 2:03 AM | Updated on Sep 18 2026 2:03 AM

మా దృష్టికి తీసుకురండి..

క్రమంగా పెరుగుతున్న సాగు విస్తీర్ణం

లాభదాయకమైన పంట..

రికార్డు స్థాయిలో టన్ను ధర రూ.23,783

రెండేళ్లలో రూ.9 వేలకుపైగా

పెరుగుదల

జిల్లాలోని ఐదు ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాల ఏర్పాటు

ధరల స్థిరీకరణ, ప్రభుత్వ

ప్రోత్సాహంతో రైతులు ముందుకు..

కొల్లాపూర్‌: జిల్లాలో ఆయిల్‌పాం తోటల పెంపకంపై రైతుల్లో ఆసక్తి పెరుగుతోంది. అందుబాటులో కొనుగోలు కేంద్రాలు ఉండడం, పంటకు గిట్టుబాటు ధరలు లభిస్తుండడంతో పామాయిల్‌ సాగుపై రైతులు మక్కువ చూపుతున్నారు. గడిచిన రెండేళ్ల కాలంలో ఆయిల్‌పాం గెలలు టన్ను ధర రూ.9 వేలకుపైగా పెరగడం.. ధరల పెరుగుదల స్థిరంగా కొనసాగుతుండడంతో తోటలు రైతులకు లాభాలు తెచ్చిపెడుతున్నాయి. దీంతో పండ్ల తోటలకు బదులుగా ఆయిల్‌పాం తోటల పెంపకంపై రైతులు దృష్టి సారిస్తున్నారు.

పైలెట్‌ ప్రాజెక్టుగా ప్రారంభం..

ఎన్‌ఎంఈఓ– ఓపీ పథకం కింద 2019–20 సంవత్సరంలో ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాను పైలెట్‌ ప్రాజెక్టుగా ఎంపిక చేసి ఆయిల్‌పాం తోటల సాగుకు శ్రీకారం చుట్టారు. చెట్లు నాటిన నాలుగేళ్ల నుంచి దిగుబడి ప్రారంభమవుతుంది. మొదటి ఏడాది నాగర్‌కర్నూల్‌ జిల్లాలోని పలు ప్రాంతాల రైతులను ఒప్పించి 221 ఎకరాల్లో తోటలు నాటించారు. క్రమంగా సాగు విస్తీర్ణం పెంచుతూ వస్తున్నారు. ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా 10,215 ఎకరాల్లో ఆయిల్‌పాం తోటల సాగు జరుగుతోంది.

ప్రభుత్వ ప్రోత్సాహకాలు..

ఆయిల్‌పాం తోటల సాగుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నేషనల్‌ మిషన్‌ ఫర్‌ ఎడిబుల్‌ ఆయిల్‌– ఆయిల్‌పాం ప్లాంటేషన్‌ స్కీం ప్రవేశపెట్టి, సబ్సిడీ అందిస్తోంది. ఈ స్కీం ద్వారా డ్రిప్‌ సౌకర్యంతోపాటు సాగుకు ప్రోత్సాహకాలు అందిస్తున్నారు. ఒక్కో ఎకరాకు మొత్తంగా రూ.50,918 సబ్సిడీ లభిస్తోంది. రూ.193 విలువ చేసే ఆయిల్‌పాం మొక్కను ప్రభుత్వం సబ్సిడీపై రూ.20కే అందిస్తోంది. ఎకరాకు దాదాపు 50 నుంచి 57 మొక్కలు నాటవచ్చు. సన్నకారు రైతులకు 90 శాతం, పెద్దకారు రైతులకు 80 శాతం సబ్సిడీపై డ్రిప్‌ సౌకర్యం కల్పిస్తున్నారు. ఆయిల్‌పాం చెట్లు ఐదు నుంచి పదేళ్లలోపు 6 టన్నుల వరకు, పదేళ్లు దాటిన చెట్ల నుంచి ఏడాదికి 10 టన్నుల వరకు పంట వస్తుంది. ఏడాదంతా పంట దిగుబడి వస్తూనే ఉంటుంది. ఈ పంటను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది.

స్థానికంగానే కొనుగోలు..

జిల్లాలో రైతులు పండించిన పంటను ప్రీయూనిక్‌ సంస్థనే కొనుగోలు చేస్తోంది. ఇందుకోసం జిల్లావ్యాప్తంగా పెద్దకొత్తపల్లి, నాగర్‌కర్నూల్‌, బిజినేపల్లి, కల్వకుర్తి, ఉప్పునుంతలలో ఐదు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాలు రైతులకు అందుబాటులో ఉండడంతో పంట అమ్మకాలకు ఎలాంటి ఇబ్బందులు లేవు. దీంతో ఆయిల్‌పాం సాగుకు రైతులు పెద్దసంఖ్యలో దరఖాస్తు చేసుకుంటున్నారు.

సంవత్సరం సాగు విస్తీర్ణం రైతులు

2021– 22 221 57

2022– 23 3,057 760

2023– 24 2,605 724

2024– 25 1,180 346

2025– 26 1,062 301

2026– 27 2,090 611

ఆయిల్‌పాం సాగు రైతులకు లాభదాయకంగా మారింది. గత రెండేళ్లలో ఆయిల్‌పాం గెలలు టన్ను ధర రూ.9 వేల వరకు పెరిగింది. ధరల్లో ఎలాంటి ఒడిదొడుకులు లేవు. ధరల స్థిరీకరణ అనేది రైతులకు మేలు చేసే అంశం. చాలామంది రైతులు ఆయిల్‌పాం సాగు కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. క్రమసంఖ్య ప్రకారం రైతులకు సబ్సిడీపై మొక్కలు, డ్రిప్‌ పరికరాలు ఇస్తున్నాం. పంట అమ్మకాల్లో ఏమైనా ఇబ్బందులు ఎదురైతే మా దృష్టికి తీసుకురావాలి.

– లక్ష్మణ్‌,

ఉద్యానవన అధికారి, కొల్లాపూర్‌

ఆయిల్‌పాం పంట ధరలు క్రమంగా పెరుగుతూనే స్థిరంగా ఉంటున్నాయి. ఇది రైతులకు లబ్ధిచేకూర్చే అంశం. 2023 ఆగస్టు వరకు ఆయిల్‌పాం టన్ను ధర రూ.14 వేలు మాత్రమే ఉండేది. అదే ఏడాది సెప్టెంబర్‌లో రూ.17 వేలు, అక్టోబర్‌లో రూ.19 వేలు, నవంబర్‌లో రూ.20 వేలకు ధర పెరుగుతూ వచ్చింది. 2024 మార్చి నుంచి టన్ను ధర రూ.20,871, 2025 సెప్టెంబర్‌ నుంచి టన్ను ధర రూ.23,783 ప్రకారం కొనుగోళ్లు జరుగుతున్నాయి. ధరల పెరుగుదలతోపాటు స్థిరీకరణ కారణంగా రైతులకు ఆయిల్‌పాం సాగు లాభదాయకంగా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement