ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి కృషి చేయాలి | - | Sakshi
Sakshi News home page

ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి కృషి చేయాలి

Sep 18 2026 2:03 AM | Updated on Sep 18 2026 2:03 AM

రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌

బక్కి వెంకటయ్య

కందనూలు: ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి కృషిచేయాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ బక్కి వెంకటయ్య అన్నారు. గురువారం జిల్లాకు వచ్చిన ఆయనకు కలెక్టరేట్‌లో కలెక్టర్‌ హేమంత కేశవ్‌ పాటిల్‌, ఎస్పీ సంగ్రామ్‌ సింగ్‌జీ పాటిల్‌ పూలమొక్కలు అందించి స్వాగతం పలికారు. అనంతరం పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. ఈ సందర్భంగా వీసీ హాల్‌లో ల్యాండ్‌, సర్వీస్‌, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులతోపాటు జిల్లాలో ఎస్సీ, ఎస్టీల సమస్యలు, న్యాయపరమైన అంశాలపై కలెక్టర్‌, ఎస్పీతో కలిసి బక్కి వెంకటయ్య సమీక్ష నిర్వహించి మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, విద్య, ఉపాధి పథకాలపై గ్రామస్థాయిలో విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు. విద్యార్థులకు అందుబాటులో ఉన్న విద్యావకాశాలు, పబ్లిక్‌ స్కూళ్లలో సీట్లు, విదేశీ విద్యకు అందించే ఆర్థిక సహాయం, భూమి ఆధారిత పథకాలు తదితర వివరాలను అర్హులైన వారికి తెలియజేసి వాటిని సద్వినియోగం చేసుకునేలా అధికారులు సహకరించాలని సూచించారు. ప్రతినెలా చివరి వారంలో నిర్వహించే సివిల్‌ రైట్స్‌ డే సమావేశాలకు పోలీస్‌, రెవెన్యూ అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలని ఆదేశించారు. అలాగే ప్రతి మూడు నెలలకు ఒకసారి జిల్లాస్థాయి సమావేశం నిర్వహించి ఎస్సీ, ఎస్టీల సమస్యల పరిష్కారంపై పురోగతిని సమీక్షించాలని చెప్పారు. అన్ని ప్రభుత్వ శాఖల్లో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల రోస్టర్‌ విధానం, రిజర్వేషన్‌ రిజిస్టర్లను నిబంధనల ప్రకారం నిర్వహించాలన్నారు. ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికకు కేటాయించిన నిధులను ఆయా వర్గాల సంక్షేమం, అభివృద్ధికి మాత్రమే వినియోగించాలని స్పష్టం చేశారు. నిధులను ఇతర అవసరాలకు మళ్లించకుండా నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. ప్రజల నుంచి వచ్చే ప్రతి దరఖాస్తును సానుకూలంగా పరిశీలించి, సమస్యలను సాధ్యమైనంత వరకు జిల్లా స్థాయిలోనే పరిష్కరించాలని చెప్పారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో ఎస్సీ, ఎస్టీ ప్రజలకు మెరుగైన వసతులు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా జిల్లా యంత్రాంగం కృషిచేస్తుందన్నారు. జిల్లా ఎస్సీ, ఎస్టీ మానిటరింగ్‌ కమిటీ సభ్యులు చైర్మన్‌ పలు అంశాలపై నివేదికను అందజేశారు. సమావేశంలో ఎస్సీ కమిషన్‌ సభ్యులు లక్ష్మీనారాయణ, నేనావత్‌ రాంబాబునాయక్‌, అచ్చంపేట సబ్‌ కలెక్టర్‌ సలోని ఛాబ్రా, అదనపు కలెక్టర్లు చెన్నయ్య, దేవసహాయం, జిల్లా ఎస్సీ అభివృద్ది అధికారి ఉమాపతి, గిరిజన సంక్షేమ అధికారి కోటాజి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement