‘పాలమూరు–రంగారెడ్డి’ నీటికోసం తప్పని నిరీక్షణ
● నార్లాపూర్– ఏదుల మధ్య పూర్తి కాని కాల్వ పనులు
● దాదాపు 8 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి తొలగింపునకు చర్యలు
● డిసెంబర్ నాటికి లక్ష్యం నిర్దేశం.. మార్చి వరకు కొనసాగే అవకాశం
● ఆ మట్టి తొలిగిస్తేనే ఏదుల
రిజర్వాయర్‌కు సాఫీగా నీరు
నార్లాపూర్– ఏదుల రిజర్వాయర్ మధ్య ఓపెన్ కాల్వలో కుడికిళ్ల, తిర్నాంపల్లి వద్ద ఉన్న రాయిని తొలిగింపు పనులు వేగవంతం చేశాం. డిసెంబర్ చివరిలోగా తొలిగింపు పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌కు సూచించాం. రాయి బ్లాస్టింగ్ చేసి లోతు నుంచి బయటకు రాళ్లు తీసుకెళ్లడం కొంత ఇబ్బందిగా ఉంది. కాల్వలో హార్డ్ రాక్ తొలిగిస్తే నార్లాపూర్ నుంచి ఏదుల రిజర్వాయర్‌కు నీళ్లు తరలించవచ్చు. ఏదుల నుంచి వట్టెం రిజర్వాయర్‌కు అక్కడి నుంచి కర్వెనకు ఎత్తిపోయడానికి పంపుసెట్లు బిగింపు సైతం పూర్తి అయ్యింది. అన్ని పనులు పూర్తయ్యి.. శ్రీశైలం ప్రాజెక్ట్‌లో నీళ్లు ఉంటే రిజర్వాయర్‌లోకి తరలించవచ్చు.
– పార్థసారధి, ఇరిగేషన్ ఎస్‌ఈ
నాగర్‌కర్నూల్: బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పనులు కొనసా..గుతూనే ఉన్నాయి. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పనులు వేగవంతం చేయడంలో నిర్లక్ష్యం చేసిందనే విమర్శలున్నాయి. గతేడాది మే నెలలో ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పర్యటించి 2025 డిసెంబర్ నాటికి పనులు పూర్తి చేయాలని ఆదేశించినా.. ఇంకా చాలా వరకు పనులు పెండింగ్‌లోనే ఉన్నాయి. దీంతో ఈ ఏడాది రెండు పంపుసెట్లు ప్రారంభించినా.. కేవలం నార్లాపూర్ రిజర్వాయర్‌లోకి రెండు టీఎంసీలు ఎత్తిపోసి నిలిపివేశారు. ఏదుల రిజర్వాయర్‌కు నీటిని సరఫరా చేయడానికి ఓపెన్ కాల్వ పనులు అసంపూర్తిగా ఉండటమే ఇందుకు కారణం. కుడికిళ్ల, తిర్నాంపల్లి వద్ద దాదాపు 8 లక్షల క్యూబిక్ మీటర్ల గట్టి రాయి ఉండటంతో నీరు వదలడానికి వీలు కాలేదని, ప్రస్తుతం రాయి తొలగింపు పనులు కొనసాగుతున్నాయని అధికారులు చెబుతున్నారు.


