చట్టాలపై అవగాహన తప్పనిసరి | - | Sakshi
Sakshi News home page

చట్టాలపై అవగాహన తప్పనిసరి

Sep 12 2026 1:24 AM | Updated on Sep 12 2026 1:24 AM

కందనూలు: విద్యార్థులకు చట్టాలపై తప్పనిసరిగా అవగాహన ఉండాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి నిహారిక అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని జ్యోతిరావుపూలే గురుకుల పాఠశాలలో విద్యార్థులకు చట్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు బోధించే పాఠ్యాంశాలను అవగతం చేసుకోవడంతో పాటు సమాజంలో జరుగుతున్న అంశాలపై విద్యార్థులు చైతన్యం కావాలని సూచించారు. జీవితంలో ప్రతి ఒక్కరు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని ముందుకెళ్లాలని తెలిపారు. కార్యక్రమంలో గురుకుల ప్రిన్సిపల్‌ నవనీత, న్యాయవాది శ్రీరామ్‌ ఆర్య పాల్గొన్నారు.

పర్యావరణ పరిరక్షణ

అందరి బాధ్యత

కందనూలు: మట్టి వినాయకులను పూజించి.. పర్యావరాణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఆర్డీఓ అర్చన అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సైన్స్‌ డిగ్రీ కళాశాలలో పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు, తెలంగాణ నేషనల్‌ గ్రీన్‌ క్రాప్స్‌, కళాశాల ఎకో క్లబ్‌ ఆధ్వర్యంలో విద్యార్థులు మట్టి వినాయకులు తయారు చేసి, సుమారు 60 గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాలలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆర్డీఓ మాట్లాడుతూ.. విద్యార్థులు పర్యావరణ పరిరక్షణపై చైతన్యం కలిగించే కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు. విద్యార్థి దశ నుంచే ఇలాంటి ఆలోచనలను గ్రామస్థాయికి తీసుకెళ్లాలని సూచించారు. అనంతరం విద్యార్థులు తయారు చేసిన మట్టి వినాయకులను పలువురికి పంపిణీ చేశారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్‌ మదన్మోహన్‌, అధ్యాపకులు అంజయ్య, వనిత, ఉమాదేవి, కోదండరాములు, రామకృష్ణ పాల్గొన్నారు.

పంచాయతీ కార్యదర్శి సస్పెన్షన్‌

అచ్చంపేట/కందనూలు: అచ్చంపేట మండలం బొమ్మనపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి వి.రమేశ్‌బాబును సస్పెన్షన్‌ చేస్తూ శుక్రవారం కలెక్టర్‌ హేమంత కేశవ్‌ పాటిల్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఒకే వ్యక్తికి రెండు వేర్వేరు తేదీలతో మరణ ధ్రువపత్రాల జారీ చేయడంపై అచ్చంపేట డివిజనల్‌ పంచాయతీ అధికారి విచారించి, నివేదిక సమర్పించగా... ఈ మేరకు కలెక్టర్‌ చర్యలు తీసుకున్నట్లు డీపీఓ శ్రీరాములు తెలిపారు. 2024 ఆగస్టు 1 నుంచి విధులు నిర్వహిస్తున్న రమేశ్‌బాబు.. మరణించిన వ్యక్తి వివరాలను రెండు పర్యాయాలు వేర్వేరు తేదీలతో ఆన్‌లైన్‌ రికార్డుల్లో నమోదు చేసి.. మరణ ధ్రువపత్రాల జారీ రిజిస్టర్‌లో మాత్రం ఒకసారి మాత్రమే నమోదు చేసినట్లు విచారణలో వెల్లడైంది. గ్రామ పంచాయతీ చట్టబద్ధ రికార్డులను సక్రమంగా నిర్వహించకపోవడం, అధికారాలను దుర్వినియోగం చేయడం, విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహించడం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని సస్పెన్షన్‌ చేసినట్లు డీపీఓ తెలిపారు.

తగ్గిన లడ్డు పరిణామం.. కేసు నమోదు

చిన్నచింతకుంట: మండలంలోని అమ్మాపురం కురుమూర్తిస్వామి ఆలయంలో భక్తులకు అందించే లడ్డు ప్రసాదం తయారీ కేంద్రంలో శుక్రవారం తూనికల అధికారులు తనిఖీలు నిర్వహించారు. లడ్డు పరిమాణం తక్కువగా ఉందని నిర్వాహకులపై కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా తూనికల జిల్లా అధికారి రవీందర్‌ మాట్లాడుతూ లడ్డూల తయారీలో అవకతవకలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవన్నారు. కురుమూర్తిస్వామి ఆలయం వద్ద భక్తులకు అందించే లడ్డు పరిమాణం 100 గ్రాములకు గాను 80 గ్రాములు మాత్రమే ఉన్నట్లు గుర్తించామన్నారు. ఈ మేరకు నిర్వాహకులపై కేసు నమోదు చేసినట్లు ఆయన వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement