కందనూలు: పోషణ మాసోత్సవాలను పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ దేవసహాయం అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ ప్రధాన సమావేశ మందిరంలో జిల్లా మహిళా శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో పోషణ్ అభియాన్ – పోషణ మాసం కార్యక్రమాలపై వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో నిర్వహించిన సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడారు. పోషణ మాసోత్సవాల్లో గర్భిణులు, బాలింతలు, చిన్నారులు, కిషోర బాలికలకు సమతుల్య ఆహారం, పోషకాహారం, ఆరోగ్య పరిరక్షణపై అవగాహన పెంచాలని సూచించారు. పోషకాహార లోపాన్ని నివారించేందుకు అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా అందిస్తున్న సేవలను మరింత సమర్థవంతంగా ప్రజలకు చేరువ చేయాలని సూచించారు. పిల్లల ఆరోగ్యకరమైన ఎదుగుదలకు తొలి దశ నుంచే సరైన పోషకాహారం అందించడం ఎంతో కీలకమన్నారు. పోషణ మాసం కార్యక్రమాలను కేవలం సంక్షేమశాఖకు మాత్రమే పరిమితం చేయకుండా.. వైద్యారోగ్యశాఖ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, విద్య, మున్సిపల్ తదితర శాఖలు పరస్పర సమన్వయంతో నిర్వహించాలని ఆయన సూచించారు. ప్రతి అంగన్‌వాడీ కేంద్రం పరిధిలో కార్యక్రమాల నిర్వహణకు ముందస్తు కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. అనంతరం ప్రతిజ్ఞ చేయించారు. సమావేశంలో జిల్లా సంక్షేమశాఖ అధికారి పాండు, డీఈఓ రమేశ్‌కుమార్, డీఆర్డీఓ చిన్న ఓబులేషు, జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ అధికారి కోటయ్య, డీపీఓ శ్రీరాములు, జిల్లా సాంఘిక సంక్షేమశాఖ అధికారి ఉమాపతి, వైద్యారోగ్యశాఖ అధికారి రవి నాయక్, డీవైఎస్‌ఓ సీతారాంనాయక్ ఉన్నారు.


